దేశానికి సార్వభౌమత్వం ఉంటుంది నీచంగా పాలించే వానికి ఉండదు అంటూ నిజామాబాద్ నుండి ఘణపురం దేవేందర్ రాసిన కవిత ' తలరాత ' ఇక్కడ చదవండి :
అబద్దానికి సిగ్గు ఉంటుంది
ఆడే వానికి ఉండదు
పదవికి గౌరవం ఉంటుంది
అడ్డదారిలో చేపట్టే వానికి ఉండదు
మతంలో హితం ఉంటుంది
ఉన్మాదంతో చెలరేగే వానికి ఉండదు
సంస్కారానికి తేజస్సు ఉంటుంది
నటించేవానికి ఉండదు
మాటకు నీతి ఉంటుంది
తప్పుడు మనిషికి ఉండదు
నోటుకు విలువ ఉంటుంది
అవినీతిగా సంపాదించే వానికి ఉండదు
ధర్మానికి క్రమశిక్షణ ఉంటుంది
స్వార్థానికి వల్లించే వానికి ఉండదు
దేశానికి సార్వభౌమత్వం ఉంటుంది
నీచంగా పాలించే వానికి ఉండదు
కవిత్వానికి వ్యక్తిత్వం ఉంటుంది
గొప్ప కోసం రాసేవాడికి ఉండదు
ప్రజాశక్తికి విచక్షణ ఉంటుంది
ప్రయోగించే వేళ తడబాటు
కొంపముంచుతుంది
ఉద్వేగం ఒక బలహీనత
కక్కిరిబిక్కిరిగా మారుతుంది
ప్రజల తలరాత