లేత పసి మనసులు ..లోతైన " పసిడి మనసులు "

By Arun Kumar P  |  First Published Feb 5, 2023, 9:10 AM IST

జి. జానకి శాస్త్రి  కథా సంకలనం “పసిడి మనసులు” పైన డా.వరిగొండ సత్య సురేఖ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :


అమాయకమైన,  కల్మషం లేని పసివారి మనస్సులు స్వర్ణ సమానమే. నిరంతరం పసివారి మధ్య గడపడం ఒక అదృష్టమే. అయితే అటువంటి అవకాశాన్ని అదృష్టంగా భావించేవారికి ఓపిక, సహనం ఎక్కువగా ఉంటుంది. పసివారి పట్ల అమితమైన శ్రద్ధ,  వాత్సల్యం, అభిమానం కలిగి ఉన్న వారికి మాత్రమే పసి వారి మనసులు అర్థం అవుతాయి.  
నోరు విప్పి ఇదీ సంగతి అని స్పష్టంగా చెప్పకపోయినా వారి మనస్సు వారి చిట్టి మాటలంత చిన్నది కాదు. ఆ చిన్ని హృదయాలు   లోతైనవి,  విశాలమైనవి.   పెద్దలకు తెలియని, తెలియనివ్వని యెన్నో రహస్యాల ఖజాన ఆ చిట్టి గూడుల చిన్ని మస్తిష్కాలు.  వాటిలో ఘర్షణలు ఉంటాయి. అలాగే చిటికెలో రాజీ పడగల నేర్పు, నైపుణ్యత ఉంటాయి.  వయసుకు చిన్న అయినా, చేసిన తప్పుని అంగీకరించడానికి, తప్పు చేసిన వారిని క్షమించడానికి వారు చూపే ఉదారత పెద్దల ముందు పిల్లలని యెప్పుడు వింధ్యా శ్రేణిలో నిలబెడుతుంది. వారిలో ఆత్మవిశ్వాసమే కాదు, ఆత్మ గౌరవం కూడా మెండుగా ఉంటుంది.  పెద్దలు దృష్టి సారించని ఇలాంటి యెన్నో పసి వారి భావనలని జి. జానకి శాస్త్రి  తమ కథా సంకలనం “పసిడి మనసులు” లో ఆవిష్కరించారు.

నేటి బాలలే రేపటి పౌరులు.  ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని పిల్లలకు ఇవ్వాలి అని భావించే ప్రతి ఒక్కరు , తమలో ఉన్న దోషాలతో పాటు తమ ఇంట్లో లేదా చుట్టూ ఉన్న సమాజం  ప్రవర్తన, నడవడిక, ఆలోచన అవి పిల్లల మనసుపై వేస్తున్న ముద్రలు వాటిని వారు స్వీకరిస్తున్న విధానం ఖచ్చితంగా తెలుసుకోవాలి.  అందుకు ఈ పుస్తకం దోహదపడుతుంది అని చెప్పవచ్చు.  మరీ ముఖ్యంగా అధ్యాపక వృత్తిలోని వారు తప్పక చదవవలసిన పుస్తకం ఇది.

Latest Videos

పుస్తకంలోని రెండు కథలు మినహా మిగిలిన కథలు భారతీయ నేపథ్యం కాకపోయినా, కథలు చదివాక మాత్రం పసివారు ఎక్కడైన పసివారే, వారి హృదయం ఎక్కడైనా అలానే  స్పందిస్తుంది అని అనిపించకపోదు. 

రచయిత్రి వృత్తి రీత్యా పిల్లల మనస్తత్వ పరిశీలకులు. పాఠశాలలోని పిల్లల మనస్త్వత్వం వారి ప్రవర్తన ఇత్యాది విషయాల పరిశీలన తత్ సంబంధిత కార్యచరణ  వారి విధుల్లో భాగం.  కాని వారి మనసులోని మాటలు పుస్తకంలో చదివినపుడు వారు కేవలం ఉద్యోగ విధుల్లో భాగంగా పిల్లలని పరిశీలించేవారని మనం అనుకోలేము. ఆ పసివారిపై వారికున్న అవ్యాజమైన ప్రేమ, శ్రద్ధ, వాత్య్సల్యం మనకు ప్రతి అక్షరంలోను కనపడుతాయి అని చెప్పడానికి సందేహపడక్కర్లేదు.   వారు  “… నా పసివారు …..” అంటూ చెప్పుకు రావడంలోనే  అర్థం అవుతుంది వారి మనసులో, జీవితంలో పసివారికి గల ప్రత్యేక స్థానం.    

కథా సంకలనం పాతికేళ్ళ వయసులోనే నూరెళ్ళు నిండిన తమ మేనల్లుడు ఉదయతేజకి అంకితమిచ్చారు. సంకలనంలోని ఆఖరి కథ "ఉదయతేజ". రచయిత్రికి వారి మేనల్లుడికి గల అనుబంధంతో పాటు చిన్నపిల్లలో సహజసిధ్ధంగా ఉండే అమాయకత్వం నిర్మలమైన ప్రేమతో వారు పెనవేసే బంధాలు, అలాగే పెద్దవారు సరదాగా  విమర్శించినా,  చిన్న హృదయాలు చిన్నబుచ్చుకుంటాయి అనే విషయం, ప్రోత్సహిస్తే పిల్లలు వారిలో ఉన్న లోటుపాటులను సరిద్దుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు అని .. అర్థం అవుతుంది ఈ కథ కాని కథలో.

సంకలనంలోని ప్రతీ కథా వారి జీవిత  అనుభవంలోనివే అయినా , చదువరికి అవి కాలక్రమంలో జరిగిన  సంఘటనల్లా కాకుండా చక్కటి సన్నివేశాల నిర్మాణంతో , సంభాషణలతో అల్లుకుపోయిన కథలే కనిపిస్తాయి.  మొదలు పెట్టాక సాంతం పాఠకులని చదివిస్తుంది ఈ పుస్తకం. అలా అని కథలు కథ దగ్గరే ఆగిపోనివ్వవు. అవి మనసుకు హత్తుకుంటాయి, ఆలోచింపచేస్తాయి, ప్రశ్నిస్తాయి, బాధని ఓ చోటా, సంతోషాన్ని మరోచోటా మిగులుస్తాయి.

పాత్రల వర్ణన ఈ పుస్తకానికి మరో అలంకరణ.  ముఖ్యం గా ప్రధాన పాత్రధారులైన పిల్లల వర్ణన.  “……లిసా ని ఒక్కసారి చూస్తే మరి మరిచిపోలేము. ఎర్రట్టి ఒత్తైన జుట్టులో, పెద్ద పెద్ద కళ్ళతో, చిన్న చిరునవ్వుతో, కాస్త వత్తరిగా ఉన్న ఆ పాప ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది….”  “… క్రిస్టోఫర్ అలెక్సాండర్ కి అయిదేళ్ళు. పొట్టిగా , బూరె బుగ్గలతో ఉంటాడు.  ఆ నీలికళ్ళు యెప్పుడు మిలమిలా మెరుస్తూ ఉంటాయి. ఒత్తైన బ్లండ్ జుత్తుని ఎప్పుడు నుదుటి మీద నుంచి త్రోసుకుంటు మాట్లాడుతాడు. ఆ బాబు మాటల పుట్ట. కాని ఎవరైన తన పేరుని కుదించి “క్రిస్టోఫర్” అన్నా “క్రిస్” అన్నా “అలక్స్” అన్నా రెచ్చిపోతాడు…”  పాత్ర రూపాన్ని , స్వరూపాన్ని ఇటువంటి చిరు పదాలతో యెంతో సరళంగా వివరంగా పరిచయం చేయడం ఈ పుస్తకంలో మరో ఆకర్షణ.   

“…..పసివారికి తల్లి తరువాత తల్లి టీచరే….” ఈ వాక్యం లోని లోతుని నేడు ప్రతీ పాఠశాల, అధ్యాపకులు అర్థం చేసుకోవాలి.  తల్లితండ్రులకి తమ పిల్లలు ఇంట ఉండే దానికన్నా ఎక్కువగా వారు చదివే పాఠశాల, కళశాలని భద్రం అని నమ్ముతారు. ఇంట్లోని వారితో గడిపే సమయం కన్నా పిల్లలు తమ విద్యాలయాల్లో గడిపే సమయం ఎక్కువ. అటువంటి  విద్యాలయాలు నేడు  విద్యార్థులని పరిణతి దిశగా కాక  వారిని ఒత్తిడికి , ఆత్మన్యూన్యతకి , వ్యక్తిత్వహీనతకి గురిచేస్తున్నాయి. విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు అనే త్రికోణం మధ్య నిలిచి సైకాలజిస్ట్ గా విశేష కృషి చేసిన ఈ రచయిత్రిలాంటి  సైకాలజిస్టులు నేడు ప్రతి విద్యాసంస్థకి ఎంతైన అవసరం.  పసి మనసులు అనే కాదు విద్యార్థి దశలో ఉన్న ప్రతి మనసు పసిడి మనస్సే. బంగారానికి  మెరుగులు దిద్ది వన్నె తెచ్చే బాద్యత తల్లితండ్రులది మరీ ముఖ్యంగా గురువులది. 

ప్రతి కథకి శీర్షిక ఆ కథ యొక్క ప్రధాన పాత్రధారి పేరునే  పెట్టారు రచయిత్రి. మొత్తం 20 కథలు ఉన్న ఈ సంకలనంలో ఆఖరి రెండు కథలు తెలుగు ప్రాంతానివి. ఒకటి “మల్లి” మరోకటి ఉదయతేజ్. ఉదయతేజ్ రచయిత్రి మేనల్లుడి కథకాగ, మల్లి రచయిత్రి బాల్యంలోని సంఘటనగా భావించవచ్చు. మల్లి కథలో “… అది స్వతంత్ర  దినోత్సవం.  అమ్మమ్మ నాకు రెండు రిబ్బన్లు కొనిచ్చింది…. స్వతంత్రం ఎంత తియ్యగా ఉందో. ఒక వారం పాటు కలిసి, మెలిసి , అలసి ఆనందిచారు అందరూ..” నిజంగా ఎంత కమ్మని మాటలు. మరో కథలో పిల్లల తత్వం గూర్చి చెప్తూ "...అందుకే పెద్దలతో పాటు, తోటి పిల్లలకి కూడా జేసన్ బొమ్మలంటే ఎంతో ఇస్టం,...నిజానికి పసిపాపల్లో అసూయంటూ ఉండదు. అది మనం-అంటే పెద్దవాళ్ళం-వారికి నేర్పిస్తాము.... " అదే కథలో తల్లి ఆ పిల్లవాడిని ఒంటరిగా ఒదిలేసి వెళ్ళిపోగా "...జీవితాన్నే మితం చేసుకున్నాడు ఆ పసివాడు.." అనే మాట గుండెని తడుతుంది. మరో కథలో " 8 ఏళ్ళ పసిపాప తాగుబోతు అయిన తల్లిని తానే తల్లిలా పెద్దరికం వహిస్తూ చూసుకునే ఆ పాప తనకు బాగా నచ్చిన బొమ్మని తల్లి త్రాగుడు కోసం అమ్మడాన్ని జీర్ణిచుకోలేక ఇల్లు వదిలివెళ్ళిపోతుంది.

  “… పదిహేను జాతుల పిల్లలున్న ఆ బడిలో  మక్సూద్ ది ఒక ప్రత్యేక కథ….”  ప్రతి జాతికి ఒక విభిన్నత నేపథ్యము ఉంటాయి. వాటితో పాటే ఆచారాలు , అలవాట్లు , సంఘర్షణలు.  ఇలా ప్రతి కథ ఒక్కో నేపథ్యంతో ఒక్కో సమస్యతో వ్రాయబడినదే .  నిజానికి పెద్దవారికి అవి సమస్యలుగా కనపడకపోవచ్చు. కాని వాటిని సరైన సమయంలో కనుక గుర్తించకపోతే ఆ చిన్ని సమస్యలే వారి జీవితంలో పెను తుఫానుగా మారే ప్రమాదము లేకపోలేదు.  అంతే కాదు చిన్నారుల వ్యక్తిత్వంపై కూడా అవి గట్టి ముద్ర వేసే అవకాశమూ లేకపోలేదు.          
  
ఇక రచయిత్రి స్వీయ పరిచయంకి వస్తే వారిని గురించి వారు ఇలా చెప్పుకున్నారు "పుట్టిపెరిగిన ఒరిస్సాలో ఉన్నప్పుడు వారికి నేను తెలుగమ్మాయిని, తెలుగు వారికి పరిచితమైతే వారికి నేను ఒరియా అమ్మాయినీ, ఢిల్లిలో ఉన్నప్పుడు వారికి సౌతిండియన్ని, ఇంగ్లాండ్లో వారికి ఇండియన్ ని."   కాని వారికి వారు భారతీయురాలిగా పరిచయం చేసుకోవడమే ఇష్టంగా చెప్పుకున్నారు.

ఈ సంకలనం ముఖచిత్రం ప్రముఖ చిత్రకారులు బాలి  వేసారు. ముఖచిత్రంతో సంకలనం యొక్క వైవిధ్యత పరిచయం అవుతుంది పాఠకుడికి. పరిచయ వాక్యాలు శ్రీమతి విజయలక్ష్మి రామక్రిష్ణన్  వ్రాసారు. వాహిని బుక్ ట్రస్ట్  ద్వారా ప్రచురింపబడింది. 

పుస్తక ప్రతులకు : వాహిని బుక్ ట్రస్ట్, విశాలాంధ్ర బుక్ హౌస్, నవోదయ బుక్ హౌస్, నవయుగ బుక్ హౌస్ , నవోదయ పబ్లిషర్స్.
 

click me!