చెరబండ రాజు గళమెత్తిన సీమ కదా! కలలు సంభాషిస్తై కలవరాలూ సంభాషిస్తై అంటూ ఏనుగు నరసింహా రెడ్డి రాసిన కవిత ' తరగని సిరులగిరి ' ఇక్కడ చదవండి :
మీకు తెలుసా
నది కూడా కదలకుండా ప్రవహించే పుడమి ఉందని
ఒక అమావాస్యన
చింతాక్రాంతుడైన అర్ధచంద్రుడు
కేసరిగిరి రామలింగనికి సాష్టాంగపడి
పరవశంలో తనువు నిక్కడ పరిచి
శివుని శిరస్సుకు దారి మరిచి పోయాడు.
అతను ఓ ఆర్ ఆర్ ఐ శుక్లపక్షకాంతులతో
వెలుగులీనుతున్నందునే కదా
ఈమె తరగని సిరులగిరి అయ్యింది
సరిగ్గా సగం సగం
ఇటు నగరపు కోలాహల హేళ
అటు పల్లెల పరవశపు సోన
తొలిసారి పల్లె పట్నానికొచ్చినప్పటి అబ్బురపు నేత్రాలు అమెవి
పట్నం పల్లెకొచ్చిన ప్రతిసారీ అచ్చెరువొందే అనురక్తి కూడా
చరిత్రలోకి టార్చివేసి కన్నార్పనీయని
పాయ్గా పాలెస్ ఇక్కడ కొన్ని పాఠాలు చెబుతుంది
అలనాటి అలజడుల ఉపశమన కేంద్రం
అల్లా ఉద్దీన్ కోటి మనం తెల్లబోయే నిజాలు వల్లెవేస్తుంది
పాదలేపనం కరిగినప్పటి ప్రవరుడి
ఆక్రందనల ఊహ ఇక్కడ మూడు రన్ వేలయి విహరిస్తుంది
ఇప్పుడు బేగంపేట, అప్పుడు హకీంపేట
వైమానిక దళ దుండిగల్
భూగోళం మీద కొత్తమెరుపుల మాలిక
హైటెక్ సిటీకి ఈ నేల మీద ఒక దూమశకట జటాజట వాహన కేంద్రం
అంతేనా...
చిరుగాలికి ఊయలలూగే
చిగురుటాకుల సందుల్లోంచి
ప్రభాతకిరణం జారకముందే
మూడు చింతల పల్లిలో
కృకవాకము వేసిన కేక
ఏడామడలూ అవధరించగలిగే ప్రశాంత గంభీర
వదనం ఈమె దక్షిణ దిగ్భాగము
వాన వానకూ నాట్య భంగిమలు మార్చే వనసమూహం
మండుటెండలతో దోస్తీకట్టి
కాలుష్యాన్ని దరిదాపులకు రాకుండా
తరిమికొట్టే షామీర్ పేట తటాకం ఆమె విహార క్షేత్రం
మూసీని శుద్ధిపరిచే అంతఃకరణతో
తొణికిసలాడే ఎదులాబాద్ చెరువు ఆమె తూర్పు విడిది
కాళేశ్వరం కొసలందుకున్న పల్లెల
వసంత గానాలు ఆమె స్వర ఝరీ మాథుర్యాలు
అటు బొంబై అలజడి తొవ్వ పరుగులు
ఇటు బోధన్ ఊరి బాట పయనాలు
అటు కాన్పూర్ దిక్కు ఎదురెక్కుడు
ఇటు భోన్గిర్ దారిలో జారిపోవుడు
ఆమె ప్రత్యేకతల్లోకెల్ల ప్రత్యేకత
దూర తీరాల నుండి ఎగిరొచ్చే
రెక్కలు మొలుస్తున్న లేతవన్నెల
పిట్టలన్నిటినీ అక్కున జేర్చుకునే
రంగుల కల్పతరవు ఆమె
క్రిక్కిరిసిన చౌరస్తాలో
ఆశలను పరీక్షకు పెట్టుకునే
అంతరంగాల రంగస్థలం.
చెరబండ రాజు గళమెత్తిన సీమ కదా!
కలలు సంభాషిస్తై
కలవరాలూ సంభాషిస్తై
కలగన్న శిఖరాలు
చేరేందుకు ఆమె పాదముద్రలు
తర తమ భేదాలు మరిచి
ఊతమిస్తై