జీవితమంటే కేవలం బ్రతకడం కాదు తన చుట్టూ ఆవరించిన అజ్ఞానపు తిమిరాన్ని పుస్తక కాంతితో యుద్ధం చేయడం అంటూ ఈ. వెంకటేష్ రాసిన కవిత ' గుడిసె జ్ఞానం ' ఇక్కడ చదవండి :
ఊరికి దూరంగా
విసిరివేయబడ్డ
ఏకాంత నిశ్శబ్ద స్మశానం
నా ఇల్లు
అయినా నా ఇల్లు
తాజ్ మహల్ కంటే
అందంగా కనిపిస్తుంది
బహుశా ప్రపంచంలో తొమ్మిదవ
వింత కావచ్చు
undefined
ఇల్లంటే నాలుగు గోడలు
విలువైన ఫర్నిచర్ కాదు
ఇల్లంటే ఒక భరోసా... ఒక స్నేహ హస్తం
ఇల్లు అంటే ఆత్మీయ అనురాగాల
అపురూప మిశ్రమం
ఇల్లు గుడిసె కావచ్చు గాక
కానీ అంబేద్కర్ చూపిన
వెలుగులో నిరంతరం
మిరుమిట్లు గొలుపుతుంది
ఇంట్లో ఎక్కడ చూసినా
పుస్తకాల జ్ఞానపు విత్తనాలు
ఇందులో కొన్ని పాత విత్తనాలు
కొన్ని సరికొత్త వంగడాలు
మరి ఈ విత్తనాలను
అజ్ఞానపు హృదయాలలో
నాటాలని
జ్ఞానపు వటవృక్షాలను
తయారు చేయాలని
నిరంతరం శ్రమిస్తుంటాను
కొందరు శ్రద్ధగా వింటారు
మరికొందరు విన్నట్లు నటిస్తారు
మేధావులు మెల్లిగా మగతలోకి జారుకుంటారు
మాది వృధా ప్రయాస అని నా మిత్రులు
మొహం మీదే మొహమాటం లేకుండా అనేస్తారు
జీవితమంటే కేవలం
బ్రతకడం కాదు
తన చుట్టూ ఆవరించిన
అజ్ఞానపు తిమిరాన్ని
పుస్తక కాంతితో యుద్ధం చేయడం
నాది గుడిసె కావచ్చు
కానీ అది పంచే జ్ఞానం
దేశంలో గల ఏ దేవాలయాల్లో కూడా లభించదు