పదాలను సవరించి పెనవేసుకున్న వాక్యం స్వేచ్ఛగా మారి నిబ్బరాన్ని వర్షించింది అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత " మళ్ళీ... " ఇక్కడ చదవండి :
పక్షి ఎగిరిపోయింది
చీకటి తెర తొలగింది
వెలుగు కిరణం
స్వప్నద్వారమై వెలిగింది
నిశ్శబ్దం అంతరించి
మాట ప్రతిధ్వనించింది
చెమట చుక్క కొత్త రెక్క తొడుక్కుంది
శిఖరపుటెత్తును తలచి తరచి
పాదం ఆత్మపరిమళమై అడుగేసింది
పదాలను సవరించి పెనవేసుకున్న వాక్యం
స్వేచ్ఛగా మారి నిబ్బరాన్ని వర్షించింది
దూరంగా వెళ్లిపోయిన మూలాలు
బంధాలై తిరిగొచ్చిన అనుభూతి
ఊపిరులన్నీ మోకరిల్లి
వెలుతురు రాలిపడిన అనూహ్య స్థితి
ఒక్కొక్క క్షణం
మేటి శకలాలను ఒడిసిపట్టిన మహాకావ్యం
అంతర్గత ధారలు
శాశ్వతమై వికసించే ఆయుధాలు
గెలుపోటముల గాయాలు
సూర్యుళ్ళ్తె నిద్ర లేచే పొద్దుపొడుపులు
కాలాన్ని చీల్చుకుంటూ సాగేదే జీవితం
ప్రతి విన్యాసంలోనూ
సరికొత్తగా పుట్టకా తప్పదు...!