75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కవిత ' హామి' ఇక్కడ చదవండి.
ఉదయాన్ని ఇంకా ఒడిసిపట్టనే లేదు
పూలు మరికొన్ని వికసించనే లేదు
అమరుల నెత్తుటి తడి సలపరిస్తూనే ఉంది
సమానత్వం, సంక్షేమం
స్వయం సమృద్ధి, స్వాతంత్ర్య అనుభూతి
ఇంకా కొంత నేలకు మిగిలే ఉంది -
త్యాగం పునాదుల మీద మనం నడిచి వస్తున్నం
రాగద్వేషాలకు అతీతంగా కలిసిపోతున్నం
శ్రమ ఈ దేశాన్ని నిర్మిస్తుంది
శ్రమ ఈ దేశాన్ని స్వప్నిస్తుంది
శ్రమ పునాదుల మీద జాతీయ జెండా
వ్యక్తి గౌరవమై రెపరెపలాడుతుంది -
చీకటి పలకరింతలు
ఆకలి కలవరింతలు
కరువు నేల వెక్కిరింతలు
సరిహద్దుల ఆవలి ఆయుధాల వెర్రి చూపులు
విసురుతున్న సవాళ్ళ మీదుగా
మన దేశం పునర్ నిర్మితమవుతూనే ఉంది -
ఈ సమయం ఒక అవకాశం
సమానత్వానికి సంఘీభావం
స్వాతంత్య్రం ఒక భరోసా
స్వాతంత్య్రం ఒక బాధ్యత.