వనపట్ల సుబ్బయ్య కవిత: మార్నింగ్ వాకింగ్

By telugu team  |  First Published May 5, 2021, 4:18 PM IST

తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పలు కవితా సంకలనాలను వెలువరించిన వనపట్ల సుబ్బయ్య మార్నింగ్ వాక్ అనే కవిత రాశారు. చదవండి.


పొద్దున 
మంచును కప్పుకొని నడుస్తుంటే
పయ్యంతా ఉడుకెక్కుతున్నది
నేల పొత్తిలిలో ఎన్ని ఖనిజాలో
నడక ఇప్పుడు ఆహరంలో బాగమైంది
నేను నడుస్తుంటే
నా వెంబడే సూర్యుడు కూడ నడుస్తున్నడు

రన్నింగ్, సైక్లింగ్ ,జాగింగ్ వాకింగ్
ఒత్తిడిని తగ్గించే వ్యాయమాలు
తూర్పుపడమరల రెక్కలూపూతూ 
పోటీలు పడ్తూ పక్షుల్లా డైలు గొడ్తున్నరు
ఉత్తర దక్షిణలుగా కాళ్ళుచేతులు ఆడిస్తూ
కళ్లుతిరిగే ఆసనాలతో కసరత్తులతో స్ప్రింగ్ లా సాగుతూ సర్కస్ లై తలపపిస్తున్నరు
రక్తపోటు, గుండెపోటు,.అస్తమా డయబేటిస్ ఆరోగ్యాల్ని
జలగల్లా పట్టిపీడిస్తున్న బీమారీలు
ఒక్కపూట వాకింగ్ బందైతే
గ్లూకోజ్ లెవల్ కిందమీదనే
పొద్దున్న
అయిదుగొట్టంగా అందరొక్కతాన
ఆరోగ్య మహా సమ్మేళనం

Latest Videos

అధిక బరువు 
అనేక రోగాలకు ఆక్సిజన్
కదులకపోతే కాలంకూడ గడ్డకడుతది
ప్రవహించకపోతే
నదైనా మల్కపడి మురుగుపడుతది
నడుస్తెనే ఆరోగ్యాలు అల్కగా 
నడుకనే మార్పుకు పునాది
మార్పును చూడాలంటే నడువాలి

చెప్పులు లేకుండ నడుస్తుంటే
నేలలోని వెచ్చదనం 
ఇసుక కమ్మదనం రుచైతున్నది
చెరువులో చేపపిల్లల్లా 
అడవిలో జింకపిల్లల్లా
మైదానంలో శాస్త్రీయ కుస్తీలు
శ్వాస ప్రాణాయమాలు యోగాసనాలు
చాతాడులా వొడితిరుగుతున్న శరీరాలు
ఎదల్ని భూమికీ ముద్దిస్తూ
పుషప్పు వామప్పులతో దండీలుగొడ్తూ
నడుముల్ని నెలవంకలు చేస్తున్న చంద్రులు

బుడ్డబుడ్డబురుకలు పత్తిపూల మొగ్గలు
చిన్నచిన్ని బుడుతల కరాటే కుంగుఫూలు 
శరీరదారుడ్యాలకై అద్బుత సాహాసాలు 
బౌలింగ్, బ్యాటింగ్,  ఫీల్డింగ్ కీపింగ్
వాలీబాల్,ఫుట్ బాల్, షటిల్, టెన్నీస్
సిక్సర్ పరుగులు కండలు కరిగే కుస్తీలు
బహుళ ఆటలతో గ్రౌండ్ నిండా ప్రాక్టీసులు
ఒలంపిక్స్ నందుకునే పిల్లల ఆశయాలు
ఫిట్ నెస్ పెరుగుదలకు
అమృత ఈత కొలను మైదానం

అడుగడుగును గుండెలకత్తుకుంటది
బౌండరి దాటిన ప్రతి బాల్ ను 
తమ్ముడులా తెచ్చి చేతికందిస్తది
చిన్న దెబ్బతగిలినా సర్రున పరుగెత్తుకొచ్చి ప్రాథమిక ఆరోగ్యకేంద్రమై కట్టుకడ్తది
ఒక్కరోజు రాకపోతే
నిన్నెందుకో రాలేదు బిడ్డా! అని
అమ్మలా తల నిమిరి అడుగుతది 
నాయినలా ఎదురుచూస్తది!
గ్రౌండ్ సామాజిక ఆరోగ్య కేంద్రం !

నీళ్ళుంటేనే చెరువుకు అందం
కాయలు గాస్తెనే చెట్టుకు గౌరవం
ఆకాశం చుక్కల్ని అలికినట్లు
మైదానం జనాలను నాటింది
కొత్త స్నేహలు విరబూస్తయి
కొత్తకొత్త కతలు గుండెలిప్పుకొని
మనుసుల్ని అల్కగ చేసుకుంటవి
ఆరోగ్యమే మహభాగ్యమని 
పచ్చని తోరణాలతో గ్రౌండ్ ముగ్గేసింది
పోదాం పద పొద్దునే గ్రౌండ్ కు.

click me!