రాగాలకు శిలలే కరుగుతాయట - అనురాగమై చూడ తోడుకు అర్థం తెలుస్తుంది అంటూ డా. సరోజ వింజామర రాసిన కవిత " తోడు " ఇక్కడ చదవండి :
నాలో అగ్నికణం నీలో జ్వలించినపుడు
నాలో తాపానికి నీకు దాహమేసినపుడు
నాలో అంకురానికి నీవు చిగురు తొడిగినపుడు
నాలో నువ్వు చూడాలనుకుంటున్న సంతోషం
అదే అగుపిస్తుంది
మీటినపుడు కదా వీణలో రాగం తెలిసేది
నువ్వుకూడా నాతో మమేకమయి చూడు
నా మధనానికి మందేమిటో తెలుస్తుంది
నాలో చీకటికి దీపమయి చూడు
నా బాటలో నడకవయి చూడు
కంటకాల బాధ ఏమిటో తెలుస్తుంది
undefined
విడిపోలేనంత దగ్గరయి చూడు
పువ్వుకు తావి బంధం ఏమిటో తెలుస్తుంది
నేను నీవయ్యానని గుర్తించినప్పుడు
అసలు నాలో ప్రేమను ఆస్వాదించి చూడు
చకోరం ఎందుకు ఆహుతవుతుందో తెలుస్తుంది
కంటకాలకు కారిన రక్తానికి
కట్టు కట్టడానికి బదులు
వాటిని కట్టడి చేసే బదులు
దూరం నిలబడి నవ్వుతావేం
సంబంధం లేదన్నట్టుగా చూస్తావేం
పరాయివానిలా పారిపోతావేం
చావమని వదిలేస్తావేం
రాగాలకు శిలలే కరుగుతాయట
అనురాగమై చూడు
తోడుకు అర్థం తెలుస్తుంది.