ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక అధ్యక్షులు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావుకు 2023 సంవత్సరానికి సినారె పురస్కారాన్ని అందజేయనున్నట్టు మహాకవి సినారె కళాపీఠం ప్రకటించింది.
ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక అధ్యక్షులు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావుకు 2023 సంవత్సరానికి సినారె పురస్కారాన్ని అందజేయనున్నట్టు మహాకవి సినారె కళాపీఠం ప్రకటించింది. జడ్చర్లలో త్వరలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును బహూకరించనున్నట్టు కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములు, సమన్వయకర్త డా. పోరెడ్డి రంగయ్య తెలిపారు.
సాహిత్యరంగంలో విశేష కృషి చేస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా వాస్తవ్యులు డా. సూర్యప్రకాశ్ రావు 2021లో ‘వ్యాస గవాక్షం’ అనే వ్యాస సంపుటిని, 2022లో ‘వెలుగు-వెన్నెల’ అనే మరో వ్యాస సంపుటిని వెలువరించారు. ‘అమ్మంగి వేణుగోపాల్ రచనలు- సమగ్ర పరిశీలన’ అనే అంశంపై పిహెచ్.డి. చేసి సిద్ధాంత గ్రంథాన్ని 2016లో ప్రచురించారు. ‘విపంచి’ వ్యాసాల సంకలనానికి, ‘భావదర్పణం’ కవితల సంకలనానికి సంపాదకుడిగా ఆయా గ్రంథాలను వెలువరించారు. ‘బాలమంజీర’ బాలల పత్రికతో పాటు ‘సమన్వయి’, ‘ధ్వని’, ‘సాహితి’ తదితర సంచికలకు సంపాదకుడిగా వ్యవహరించారు.
ఆకాశవాణిలో క్యాజువల్ న్యూస్ రీడర్ గా రేడియో శ్రోతలకు డా. సూర్యప్రకాశ్ రావు కంఠం సుపరిచితం. ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ తో పాటు పలువురు ప్రముఖుల కీలక ప్రసంగాలను ఆయన తెలుగులోకి అనువదిస్తున్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి. ఏ. జర్నలిజం కోర్సు మెటీరియల్ ను సూర్యప్రకాశ్ రావు తెలుగులోకి అనువదించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకోసం విలువల విద్య పాఠ్యగ్రంథాన్ని తెలుగు అకాడమీ కోసం ఇంగ్లీషులోకి అనువదించారు. పాఠ్య ప్రణాళికా చట్రాన్ని, నూతన విద్యా విధానాన్ని ఎస్.సి.ఇ.ఆర్.టి. కోసం తెలుగులోకి తెచ్చారు. మైసూరులోని ఎన్.సి.ఇ.ఆర్.టి. ప్రాంతీయ విద్యాకళాశాల రూపొందించిన ప్రయోగాల కరదీపిక రచయితల్లో ఒకరిగా సైన్సు ప్రయోగాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
సర్వశిక్షా అభియాన్ రూపొందించిన ‘ప్రాథమికోన్నత స్థాయి గణిత బోధన వ్యూహాలు’, ‘ఉపాధ్యాయ నిబద్ధత, వృత్తిపరమైన అభివృద్ది’, ‘విద్యా వాలంటీర్ల శిక్షణ కరదీపిక’, ‘పాఠశాల సముదాయాలు- కార్యచరణ ప్రణాళిక’ తదితర గ్రంథాల రచనలో భాగస్వామి అయ్యారు. సాహిత్య విమర్శ, సంస్కృతి, అకడమిక్ అంశాలు, ఆర్థిక శాస్త్రం, విద్యారంగం, సమకాలీన అంశాలపై వివిధ పత్రికలు, మ్యాగజైన్‌ల కోసం వందల సంఖ్యలో వ్యాసాలు రాయడంతో పాటు కవితలను, కథలను రాశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారిగా, ‘సంపూర్ణ విద్యాదర్శిని’ జిల్లా సమన్వయకర్తగా పని చేశారు. నూతనంగా ఏర్పడ్డ మెదక్ జిల్లాలో విలీన విద్య, సమాజ సమీకరణ, మీడియా జిల్లా సమన్వయకర్తగా పనిచేశారు.
తెలుగు సాహిత్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పొందిన డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు అదే విశ్వవిద్యాలయంలో బీఈడీ చేశారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సైకాలజీలో ఎమ్మెస్సీ చదివారు. అదే విశ్వవిద్యాలయంలో పబ్లిక్ రిలేషన్స్ కోర్సు పూర్తి చేసి, ఉత్తమ విద్యార్థిగా స్వర్ణ పతకం పొందారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నటనలో పీజీ డిప్లొమా చేశారు. యూజీసీ-నెట్, ఏపీసెట్ అర్హత పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించారు.
విద్యాభ్యాస కాలంలో ఉత్తమ విద్యార్థిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలుగు విజ్ఞాన పారితోషికం పొందారు సూర్యప్రకాశ్ రావు. కళాశాల స్థాయిలో ఉన్నప్పుడే ‘కన్యాశుల్కం’ నాటక శత వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో బహుమతి పొందారు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్‌లో డాక్టర్ టి సుబ్బరామి రెడ్డి స్వర్ణ పతకం స్వీకరించారు.
నిజామాబాదు జిల్లా ఎడపల్లి శ్రీరామమఠం వారి రామదాసి రాజారాం మహారాజ్ స్మారక రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాన్ని 2019 లో స్వీకరించారు. వాసా ఫౌండేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీల్లో బహుమతి పొందారు. అక్షర కౌముది సంస్థ 2020లో కాళోజీ స్మారక పురస్కారాన్ని అందజేసింది. ఆయన రచించిన వ్యాసాల సంపుటి ‘వ్యాస గవాక్షం’ ఉత్తమ గ్రంథంగా 2022 లో అంగలకుదిటి సుందరాచారి ఛారిటీస్ సంస్థ వారి పురస్కారం పొందింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక అధ్యక్షుడిగా జిల్లాలో సాహిత్య చైతన్యం కలిగించేందుకు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు కృషి చేస్తున్నారు. దర్పణం సాహిత్య వేదికను స్థాపించి, నవ కవులకు దిశానిర్దేశం చేస్తున్నారు.