దూరంగా, మంద్రంగా వెంటాడుతున్న ఋతుగీతాన్ని
డా. కలువకుంట రామకృష్ణ కవిత ' ప్రాకృతిక సౌందర్యాన్వేషణ ' లో చదవండి :
కోటి ఆశల చిగురుటాకుల వనాలు
లేలేత మొగ్గల స్నిగ్ధత్వాలు
కొత్త కొత్త మెత్తని గడ్డి మైదానాలు
కొంగలు వాలిన సరస్సులూ
ఎగిరే పకక్షుల వరుసల్ని
ఒంటిమీద నిలుపుకున్న నింగికన్నె సొగసులూ
నవ్వుల దోసిళ్లతో వెదజల్లుతున్న పూల పరిమళాలు
కొమ్మల చేతుల్తో పిలుస్తున్న వృక్షోత్సాహాలను
కళ్లారా చూశావా ఎపుడైనా?
గుండె ధైర్యానికి పర్యాయపదంలా
గంభీరంగా నిలువెత్తు పర్వత శిఖరాలు
ప్రేమాశ్రువర్షం కురిపించే పిల్ల కాలువలూ,
ఎగసిపడే సాగర కెరటాలూ...
సన్నని మూలుగల్లా నీటిధారల గుమ్మరింత ప్రతిధ్వనులూ...
జడలు గట్టిన పెద్ద ముత్తైదువల్లా మర్రి చెట్టు ఊడలూ...
ఒంటినిండా ఆకుపచ్చదనం అల్లుకున్న సుకుమార లతలు
ఎన్నెన్ని చిత్ర విచిత్రాలో...
జీవన యవనికపై అద్దిన వర్ణచిత్రాలై
నిశ్శబ్ద సంగీతాన్నేదో మనలోకి ఒంపుతుంటాయి.
undefined
ప్రకృతి కౌగిట్లో వాలిపోయిన మనస్సు
ప్రతి ఉషోదయాన ఉదయించే ఉద్యమ తేజస్సు
హరితవర్ణ పానుపు పరచి పిలుస్తున్నది ప్రకృతి మాత
ఆస్వాదించే మనస్సు నీకుందా?
ముగ్ధభావనా సౌందర్య మేను సందేశాల వర్తమానాలు
అలుపెరుగని జీవన బాటసారికి కొత్త ఉత్సాహాన్నిచ్చే
వన సంచారం...
ప్రతి శ్వాసనూ... స్వచ్ఛంగా, స్వేచ్ఛగా....
జనారణ్యం నుండి విడివడి తీగలు సాగినకొద్దీ
మనోనేత్రాలు సరికొత్తగా విచ్చుకుంటున్నై
ఏకాంత నిశ్శబ్ద ప్రాకృతిక సౌందర్యాన్వేషణలో
ప్రకృతిలో లీనమై పరవశమై... ఎగిరే విహంగమై !
శుష్కపుటెడారిలో నిరాశల ఎండమావుల దగ్ధగీతాలు
చుట్టుముట్టినపుడల్లా
ఔషధం ప్రకృతినే కదా!
లయతప్పిన జీవన వీణను
శుత్రి చేసే మార్మిక అంతస్సూత్రం ప్రకృతినే కదా !
కొన్ని సూర్యోదయ ఉషఃకాంతుల్ని
మరిన్ని పున్నమి వెండి వెన్నెల వెలుగుల్ని
మన లోలోకి ఒంపుకుందాం !
ఎందుకైనా మంచిది
గుండె బరువెక్కినపుడల్లా
ఏ పొలం గట్టునో
ఏ చెట్టు నీడనో
చెరువు కట్టమీదో
కాసేపు నిశ్శబ్దంగా కూర్చుందాం !
చిగురిస్తున్న కొత్త జీవనోత్సాహాన్ని ఆస్వాదిద్దాం !!
''శిశిర వసంతౌ పునరాయాతః''
దూరంగా, మంద్రంగా ఋతుగీతమేదో
నన్నింకా వెంటాడుతూనే వుంది.