ప్రకృతి విధించిన శిక్షకు చోద్యం చూస్తున్న ఆకాశ భవనాలు త్రిశంకు స్వర్గంలో అందాల నగరాలు అంటూ డా.చీదెళ్ళ సీతాలక్ష్మి రాసిన కవిత త్రిశంకు స్వర్గం ఇక్కడ చదవండి :
దంచికొడ్తున్న వర్షం
కుండపోతగా కుమ్మరిస్తూ
దివినుండి భువికి ధారలై కురుస్తూ
ఆగని ఆకాశ ధారలు
రోడ్లన్నీ జలమయం
విరిగిన చెట్లు
కూలిన ఇండ్లు
తెగిన వైర్లు
కొట్టుకుపోతున్న వాహనాలు
గాలిలో ప్రాణాలు!!
నిన్న చెరువులను మింగేసిన నగరాలు
నేడు సముద్రాన్ని తలపిస్తూ
అలల సవ్వడితో...
పారుతున్న నీరు
మత్తడి దుంకుతూ
చిత్తడి చిత్తడి చేస్తూ
అతలాకుతలమై
ఆగమాగమైన అందాల నగరాలు!!
దురాశతో చెట్లను కొట్టేసి
బహుళ అంతస్తులు కట్టేసి
పల్లానికి నీరు పోలేక
నాని ముద్దైన నగరాలు
లబోదిబోమంటున్న జనాలు
ప్రకృతి విధించిన శిక్షకు
చోద్యం చూస్తున్న ఆకాశ భవనాలు
త్రిశంకు స్వర్గంలో అందాల నగరాలు