డాక్టర్ అస్నాల విమల పరిశోధన గ్రంథం ఆవిష్కరణ

By Siva Kodati  |  First Published May 4, 2023, 9:09 PM IST

తెలంగాణ కథ అంటే ఈ ప్రాంత ఉద్వేగ అస్తిత్వ ఉద్యమాల చరిత్ర అని తెలంగాణ రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు . దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ అస్నాల విమల పరిశోధన గ్రంథం "తెలంగాణ కథలు సామాజిక రాజకీయ దృక్పథం " ను  ఆయన ఆవిష్కరించారు.
 


తెలంగాణ కథ అంటే ఈ ప్రాంత ఉద్వేగ అస్తిత్వ ఉద్యమాల చరిత్ర అని తెలంగాణ రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు . టీజీవో భవన్ హన్మకొండలో దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ అస్నాల విమల పరిశోధన గ్రంథం "తెలంగాణ కథలు సామాజిక రాజకీయ దృక్పథం " ను  ఆయన ఆవిష్కరించారు.

ఆస్నాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ సామాజిక చరిత్రను మలుపు తిప్పిన కడవెండి గ్రామ బిడ్డగా అస్నాల విమల ఆ ఉత్కృష్ట వారసత్వాన్ని నిబద్ధతను తన పరిశోధన గ్రంథరచనలో కనపర్చారని. ఉత్తమ సాహిత్య అధ్యయనం వలనే సమాజంలో మార్పులు వస్తాయని అన్నారు . తెలంగాణ సాహిత్యాన్ని మరింత పరిశోధించి ప్రజలకు చేరవేయాల్సిన భాద్యత పరిశోధకులపై ఉందని ఈ బాధ్యతను అద్వితీయంగా నిర్వర్తించి అమూల్యమైన గ్రంధాన్ని వెలువరించిన ఆస్నాల విమలను అభినందించారు.

Latest Videos

undefined

ప్రముఖ సాహితీవేత్త ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య మాట్లాడుతూ ఐదున్నర దశాబ్ధాల సాహిత్యాన్ని పరిశోధించి అరుదైన అంశాలను వెలికితీసి సమాజానికి అందించిన ప్రామాణిక గ్రంధం అని  కొనియాడారు.  ప్రాంతీయ సాహిత్యాల పరిశోధనను ప్రారంభించిన ఘనత కాకతీయ విశ్వ విద్యాలయంకు దక్కిందన్నారు.

టీజీవో నేత అన్నమనేని జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల వెలుగులో సామాజిక మార్పు ఉద్యమాలకి సాహిత్యం, కళలు చోదక శక్తులుగా పని చేస్తాయి అని ఈ అంశాన్ని ప్రామాణికంగా విమల తన పుస్తకంలో వివరించారు అని అన్నారు.  సాహితి సదస్సులకు సమాలోచనలకు టీజీవో భవన్ ను ఉచితంగా ఇస్తామని అన్నారు. కడియం ఫౌండేషన్ చైర్మన్ కడియం కావ్య మాట్లాడుతూ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రకు పట్టం కట్టిన గ్రంథమని అన్నారు.  జిల్లా సహకార అడిట్ అధికారి మాటేటి నీరజ పుస్తకాన్ని సమీక్షిస్తూ సాహిత్యఅభిమానులకు ,పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఉత్తమ రచన అని అన్నారు 

 

 

డికెఎఫ్  అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి సౌభాగ్యం ప్రేమ ప్రజాస్వామ్యంతో ఉండే సౌందర్య తెలంగాణ అవిష్కరణ కోసం తమ వంతు మేధో సాహిత్య  కృషిని 2004 నుండి కొనసాగిస్తున్నామని అన్నారు. గ్రంధకర్త అస్నాల విమల మాట్లాడుతూ అసలు బతకడమే కష్టమన్న చోట ,నిత్య నిర్భందం అమలు అవుతున్న 1901-1956 కాలంలో పోరాటంలో పాల్గొంటూ రచయితలు చరిత్రను కథల రూపంలో నమోదు చేసిన నేపధ్యం ఈ పరిశోధన గ్రంధం వెలువడడానికి ప్రేరణగా పని చేసింది అన్నారు .

ఈ సమావేశంలో ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ మాలతిలత , జానపద అధ్యయన కేంద్ర డీన్ ఆచార్య గడ్డం వెంకన్న, రైతు సంఘ నేత మోర్తాల చందర్రావు, టీజీవో నాయకులు డాక్టర్ ప్రవీణ్ , సుధీర్ , రాజేష్ బాలునాయక్ , ఫౌండేషన్ నేతలు ఏరుకొండ నర్సింహా స్వామి, బోనగిరి రాములు, బిల్లా మహేందర్, మోటే చిరంజీవి, అస్నాల సుజాత , అరె సంఘం నాయకులు జెండా రాజేష్ వందలాది సాహిత్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని రచయిత్రి అస్నాల విమల వెంకటయ్య దంపతులను ఘనంగా సత్కరించారు.
 

click me!