కరోనాపై కోట్ల "గడప దాటని యుద్ధం"

By Arun Kumar P  |  First Published Jul 19, 2022, 1:03 PM IST

కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన "గడప దాటని యుద్ధం" కరోనా నానీలపై సంబరాజు రవి ప్రకాశ్ చేసిన సమీక్ష ఇక్కడ చదవండి :
 


రెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. ఒక్కోసారి మధ్యలో విరామం ఇస్తూ , మరొకసారి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఈ రెండు రోజులుగా ఇంట్లో ఉన్న నా హృదయాకాశం 'నానీవృతమై'ఉంది. నిన్న ఆచార్య రఘు నానీలు నన్ను కదిలించి వేస్తే, ఈరోజు కోట్ల వెంకటేశ్వర రెడ్డి "గడప దాటని యుద్ధం" కరోనా నానీలు దుఃఖ వర్షాన్ని కురిపించాయి. కోట్ల నాకు ప్రియమైన కవి. నా పదవ తరగతిలో ఆయన  "గుండె కింద తడి" కవితా సంపుటి చదివాను. అప్పటినుంచి  ఆయన కవిత్వం వీలైనప్పుడల్లా చదువుతూనే ఉన్నాను. తెలంగాణ వచన కవిత్వానికి కోట్ల 'అధికారిక రాయబారి'.  ఆయన జీవితమే కవిత్వం.

అటు వచన కవిత్వంలోనూ ఇటు నానీల రచనలోనూ కోట్లది అందవేసిన చేయి. వస్తువును పట్టుకోవడంలో ఆయన ప్రతిభ నాన్యతోదర్శనీయం. ఇక పట్టుకున్న వస్తువును కవిత్వీకరించడంలో శక్తి, నిపుణత , లోకానుభవం,  కావ్య పఠనం మొదలైనవన్నీ పడుగుపేకల్లా కలిసిపోతాయి. ఒక సుందర వ్యక్తీకరణ కలం నుండి జాలు వారుతుంది. చదువరులను అబ్బురపరుస్తుంది. కోట్ల కలానికి వేగం కూడా ఎక్కువే. పుస్తకాల ముద్రణలో కూడా తన వడిని ప్రదర్శిస్తుంటాడు. ఇక్కడ వేగాన్ని ఎందుకు ప్రస్తావించాలంటే కోట్ల ఈ గడప దాటని యుద్ధం నానీలను  ఒకరోజులో ఉషోదయం నుండి సంధ్యా సమయం లోపల రాశాడని జలజం సత్యనారాయణ తన ముందుమాటలో పేర్కొన్నాడు. ఇంత వేగంగా రాసిన కవిత్వంలో కవిత్వం పాలెంత ఉంటుంది? అన్న ప్రశ్న మీలో ఉదయించవచ్చు. ఇందులోని ప్రతి నానీ దేనికదే ఒక రస విరాట్ స్వరూపం.

Latest Videos

ప్రతి నానీలో విలక్షణమైన ఎత్తుగడ, అంతే విలక్షణమైన ముగింపు. లక్ష్మణ చక్రవర్తి వంటి విమర్శకులు కోరుకునే వ్యక్తీకరణలోని కళాత్మకమైన గుణం ఈ నానీల నిండా కనిపిస్తుంది. కోట్లకు  తన కవితను ఎలా ప్రారంభించాలో తెలుసు.. ఎక్కడ ముగించాలో తెలుసు... తాను ఎన్నుకున్న వస్తువుకు అనుగుణమైన పోలికలను, దృశ్యాలను, ప్రతీకలను భావచిత్రాలను, అభివ్యక్తిని, వాటికి అనుగుణమైన భాషను ఎన్నుకోవడంలో కోట్ల ముందుంటాడు.

ఇక గడప దాటని యుద్ధం పుస్తకంలోని కొన్ని కరోనా నానీలను చూద్దాం.

"కరోనా
ఓ డర్టీ ఫెలో
పరిశుభ్రతను చూస్తే
పడి 'చస్తది'!"

నానీల నిర్మాణాన్ని విశ్లేషించి చూస్తే నాలుగు పాదాలు నానీలోని మొదటి రెండు పాదాలు ఒక భావాన్ని చెబితే, మరో రెండు పాదాలు మరొక భావాన్ని గుమ్మరిస్తాయి. చివరి రెండు పాదాలు మొదటి రెండు పాదాలను సమర్థించవచ్చు. లేదా వ్యాఖ్యానించవచ్చు. లేదా ఒక చమత్కారాన్ని వ్యంగ్యం ద్వారా సాధించవచ్చు. ఒక నానీ 20 నుండి 25 అక్షరాలకు మించకుండా ఉంటుంది.  పాదంలోని   అక్షరాలకు సంఖ్య నియతి లేదు. స్వేచ్ఛ కవీంద్రునిదే. పైన ఉదహరించిన నానీలో చివరి రెండు పదాలలో ఒక వ్యాఖ్యానమూ ఉంది. ఒక వ్యంగమూ ఉంది. కరోనా అపరిశుభ్రతకు సంకేతం. పరిశుభ్రత దానికి గిట్టదు. పరిశుభ్రత ఉన్నచోట అది ఉండదు. దానినే కోట్ల వ్యంగ్యంగా పడి 'చస్తది'అన్న ప్రయోగం ద్వారా చెప్పాడు. మామూలుగా భాషలో 'పడి చస్తది'  అంటే బాగా ఇష్టమని అర్థం. కానీ ఈ నానీలో ఆ పదాన్ని వ్యతిరేకార్థంలో ప్రయోగించడాన్ని మనం చూడవచ్చు. తెలుగు భాషలోని చమత్కారానికి ఇది ఒక ఉదాహరణ. పరిశుభ్రత, అపరిశుభ్రత అనే రెండు వ్యతిరేకాంశాలను తీసుకొని శబ్ద చమత్కారం సహాయంతో ఈ నానీకి కోట్ల జీవం పోశాడు.

"ఇంత విపత్తులో
దేవుళ్ళెక్కడ?
స్టెతస్కోపుల్తో
గాంధీ హాస్పిటల్లో!"
పై నానీలో మొదటి రెండు పాదాలు ఒక ప్రశ్నను వేస్తున్నాయి. చివరి రెండు పాదాలు పాఠకుడు ఊహించని జవాబు ఇస్తున్నాయి. దీనినే మనం నానీలలోని మెరుపుగా  భావించవచ్చు. ఈ మెరుపు వల్లనే ఒక కవితానుభూతికి లోనవుతాం. ప్రత్యక్షంగా విశేష సేవలు అందించిన డాక్టర్లను దేవుళ్ళుగా అభివర్ణించడం అందరికీ ఆమోదనీయమైన సత్యం. ప్రజలు మాట్లాడుకునే అంశాన్ని పట్టుకొని దానిని కవితావస్తువుగా చేయడం 'కోట్ల' ప్రతిభ.

"రోడ్లన్నీ
బావురుమంటున్నాయి
కందిపోయే
వలస పాదాలను చూసి!"
కరోనా సమయంలో వలస కార్మికుల అగచాట్లు ఒక దుఃఖ భరితమైన అధ్యాయం. వందల కిలోమీటర్లను కాలినడకన అధిగమించిన తీరు అశ్రు సముద్రాన్ని పొంగి పొరలేలా  చేసింది. బాలింతలు, గర్భవతులు, వికలాంగులు, వృద్ధులు, సకలాంగులు ఎవరైతే నేమి? అందరూ ఆ కష్టం బారిన పడిన వారే. "భగవాన్ ! పగవానికి కూడా రాకూడదు ఈ కష్టం" అని  ప్రతి ఒక్కరూ ప్రార్థించిన వాళ్ళమే. ఇక నిలువెల్లా కవిత్వమై సంచరించే కోట్ల దానిని చూసి స్పందించకుండా ఉంటాడా?

"నేను
గణం తప్పని పద్యాన్ని
ఇవ్వాళ
గడప దాటని యుద్ధాన్ని!"
పద్యం గణం తప్పితే ఛందోభంగమవుతుంది. మనిషి గడప దాటితే బతుకు భంగమవుతుంది. కరోనా సమయంలో ఎవరైనా గడప దాటని యుద్ధం చేయాల్సిందే. లేకుంటే వాడు గణం తప్పిన పద్యమవుతాడు. పై నానీలో మొదటి రెండు పాదాలు చివరి రెండు పదాలకు ప్రతిబలకంగా ఉన్నాయి. 'గడప దాటితే గణం చెదురుతుంది'అన్న హెచ్చరిక ఈ నానీలో కనపడుతుంది.

"కాలం
కలిసి రానప్పుడు
తగ్గాలి
ఖైరతాబాద్ గణేశే ఆదర్శం!"
పై నానీలో మొదటి మూడు పాదాలు ఒక అంశంగా, నాలుగో పాదం ఒక అంశంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. రూప నిర్మాణంలో నానీకున్న వెసలుబాటు ఇది. దీని నిర్మాణ సూత్రాలు ఒక చట్రంలో బిగించి లేవు. కవి తాను చెప్పదలుచుకున్న అంశానికి అనుగుణంగా నాలుగు పాదాలను ఎలాగైనా వాడుకోవచ్చు. కరోనా సమయంలో ఖైరతాబాద్ గణేశుని ఎత్తు 66 అడుగుల నుంచి ఒక అడుగుకు తగ్గిపోయింది. పట్టువిడుపులు ఉంటేనే కదా జీవితం. కరోనా మనకు కలసిరాని కాలం. ఆ సమయంలో ఇంట్లో ముడుచుకుని ఉంటేనే మనుగడ సాధ్యం. కొంచెం ఎక్కువ ఏమైనా చేస్తే మరణ మృదంగం మోగుతుంది. ఇదే ఈ నానీ అంతరార్థం.'పంజరాల్ని దాటుకుని, బంధనాలు తెంచుకొని దేనికోసమో, ఎవరికోసమో బయటకు వెళ్లే కాలం కాదు' కరోనాకాలం.

"చెప్పిన దానికన్నా చెప్పనిదే ఎక్కువ ధ్వనిస్తే అది సాంద్రమైన నానీ"అని నానీల సృష్టికర్త ఆచార్య గోపి అంటారు. దానికి బలమైన సాక్ష్యం మనం ఇంతకుముందు చెప్పుకున్న నానీ.  కోట్ల నానీలలో భారత, భాగవతాలలోని పాత్రలు మనకు కనబడతాయి. ఏ పాత్రలను ఏ భావంలో ప్రవేశపెట్టాలో ఆయనకు బాగా ఎరుక. సందర్భానికి తగినట్లుగా, ప్రకటించే భావానికి అనుగుణంగా ఇతిహాస పాత్రలను తన నానీలలో కోట్ల ప్రవేశపెట్టాడు. ఇలా చేయడం వల్ల నానీకి కొత్త కాంతి వచ్చినట్లయింది.

"కరోనా
అంతటా ఉంది
చూపించే ప్రహ్లాదుడే
ఇంకా పుట్టలే!"
ఇందు గలడు... అందు లేడని సందేహము వలదు.. చక్రి సర్వోపగతుండు... ఎందెందు వెతికిన అందందే గలడు... అంటూ తన తండ్రికి స్తంభంలో నరసింహ స్వామిని చూపించిన ప్రహ్లాదుని పాత్రను కరోనాతో అనుసంధానించడం కవి భావనా శక్తికి నిదర్శనం. కంటికి కనబడని కరోనా రూపంపై ప్రపంచవ్యాప్తంగా అంతులేని పరిశోధనలు జరిగాయి. అది ఎలా వ్యాపిస్తుందో, దాని రూపం ఏమిటో తెలియక విశ్వమంతా గగ్గోలు చెందింది. వైద్యరంగ శాస్త్రవేత్తలకు కరోనా ఒక సవాల్ విసిరింది. కోట్ల ఈ నానీ రాసే నాటికి వైద్యశాస్త్రం ఆ రోగాన్ని ఛేదించలేదు. భారతంలోని  పాత్రతో రాసిన కింది నానీని చూడండి.
"ఇది శాపగ్రస్త
కర్ణభూమి
యుద్ధ సమయంలో
ఏ అస్త్రం పనికిరాదు"
కర్ణుడు అనేక శస్త్రాలలో నేర్పరి. అయినప్పటికీ యుద్ధ సమయంలో ఆయనకవేవి గుర్తుకు రాలేదు. అది ఆయనకున్న శాపం. కరోనాపై వైద్యులు అనేక రకాల ఔషధాలను ఉపయోగించారు. తొలి దశలో అవన్నీ నిరర్ధకంగా మారిపోయాయి. దీన్నే కవి పై నానీలో సూచిస్తున్నాడు. ప్రపంచాన్ని శాపగ్రస్త కర్మభూమిగా పేర్కొనడం కోట్ల భావ శబలతను తెలియజేస్తున్నది.

"మనిషిని చూసి
మనిషి భయపడటం
ఇప్పటి
అవ్యక్త విషాదం!"
నిజంగా ఎంత అల్లాడిపోయాం. బయటి మనుషుల సంగతి అటు ఉంచితే ఇంట్లోనే కుటుంబ సభ్యులు ఎవరైనా దగ్గినా , తుమ్మినా వారిని అనుమానపు చూపులు చూడాల్సి వచ్చింది. అత్యవసరంగా వారిని వేరు గదులలో ఉంచాల్సి వచ్చింది. ఒకే కుటుంబంలో అడ్డుగోడలు కట్టుకోవాల్సి వచ్చింది. అత్యవసర పనిమీద బయటకు వెళితే  కళ్ళు ఎమ్మారై స్కానర్లలా మారిపోయాయి. ప్రతి ఒక్కరిని నఖశిఖపర్యంతం పరీక్షించిన వాళ్ళమే. కరోనా సమయపు మానవ స్వభావాన్ని చక్కగా వివరించిన నానీ ఇది. సాటి మనుషులను అనుమానంగా చూడవలసి రావడం, మనిషికి మనిషే భయపడడం అవ్యక్త విషాదమే కదా! అంతకన్నా మరో దురదృష్టం ఉంటుందని అనుకోను.

"కాల గమనాన్ని అర్థం చేసుకొని నిత్య నూతనంగా రచనలు చేసేవాడే ఉత్తమ కవి"అని ఆచార్య గోపి ఒకచోట అంటాడు. ప్రపంచ మానవ చరిత్రలో కరోనా అంత ఆధునిక విషాదం మరొకటి లేదు. కనపడని శత్రువుతో చేసిన యుద్ధంలో ఒరిగిన నరకంఠాలెన్నో కదా!. ఇంతటి బీభత్సకర దృశ్యాన్ని కోట్ల వంటి కవి కవిత్వీకరించకుండా ఎలా ఉండగలడు?  ఆ ఉండలేని తనమే 'గడప దాటని యుద్ధం' నానీలు.

"ఈ ఎండా కాలానికి
ఏ మందుల్లేవు
మల్లెపూల కుర్రాడు
ఏమయ్యాడో!"
పై నానీలో కరోనాను ఎండా కాలంతో కవి పోల్చాడు. గ్రీష్మ తాపంతో జనం ఎంత అల్లాడుతారో అంతకు లక్షల రెట్ల ప్రతాపంతో కరోనా భీకరమైన వాతావరణాన్ని సృష్టించింది. కొన్ని ప్రాంతాలకు ప్రాంతాలు మరు భూములుగా మారిపోయాయి. స్మశానాలలో చోటు దొరకలేదు. శవ దహనాలకు రోజులకు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. కరోనా ఒక ఎండాకాలమా? కోట్ల గ్రీష్మాలు ఒక్కసారిగా నేలరాలిన పరిస్థితి, దుస్థితి ‌. అలాంటి ప్రళయ బీభత్సవేళ కవి మల్లెపూల కుర్రాడిని గుర్తు చేసుకుంటున్నాడు. వేసవి తాపానికి మల్లెపూల పరిమళం ఒక మందు. ఈ నానీలో మానవత్వం గుభాళించింది.

"పరక చేపలకు గాలాలేసే
తురకల పోరలు ఏమైపోయిరి?
లారీలల్లో క్లీనర్లైరా...
పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా.."అంటూ గోరేటి వెంకన్న తన పాటలో తురకల పోరలను గుర్తుకు తెచ్చుకున్న విషయం గుర్తుకు వచ్చింది. కనపడకుండా పోయిన సాటి మనిషిని గుర్తుకు తెచ్చుకోవడం కంటే మానవత్వం మంచితనం ఇంకేముంది?

వందకు పైగా ఉన్న ఈ నానీలలో వస్తువు విషయంలో ఏక సూత్రత ఉంది. అవన్నీ కరోనా చుట్టే తిరిగాయి.  ఒకే అంశంపై శతాధిక సంఖ్యలో నానీలు రాయడం కత్తి మీద సామే. కానీ ఆ పనిని కోట్ల అలవోకగా చేశాడనిపిస్తోంది. ఈ పనికి ఆయన సుదీర్ఘ కవితా ప్రస్థానం సహకరించింది. అధ్యయనం మరింత ఉపకరించింది. పరిశీలన రచనాశక్తిని పరాకాష్టకు చేర్చింది. వ్యక్తీకరణ కొత్త అడుగులు వేసింది. ఏ నానీని పరికించి చూసిన అస్పష్టత అన్న మాటే లేదు. కరోనా మహమ్మారి వికృత స్వరూప స్వభావాలను, దానివలన ప్రపంచం పడిన ఇబ్బందులను, మారిన మనుషుల జీవన విధానాలను, బలవంతంగా పోగొట్టుకోవాల్సి వచ్చిన కొన్ని అలవాట్లను, అండగా నిలబడిన ఆపద్బాంధవులను, ఒక్కసారిగా తలకిందులైన పరిస్థితులను అన్నింటిని "గడప దాటని యుద్ధం"లో కోట్ల గడప దాటకుండా ప్రస్తావించాడు. సమకాలీన స్ఫూర్తి ఈ నానీల ప్రత్యేకత.

"ఎవరి పద్యానికి
కరోనా బలయితుందో
వారేపో
ఈనాటి మహాకవి!"
ఈ పుస్తకం వచ్చేనాటికి కరోనా అంతరించిందనే చెప్పవచ్చు. అందుకే ఈనాటి మహాకవి  నిస్సందేహంగా కోట్లనే.

click me!