మట్టి మనుషుల బాధ శూన్యంలో శంఖం అంటూ నూతనంగా వ్యక్తీకరించిన దాసరి మోహన్ కవిత " మట్టి మనుషులు....." ఇక్కడ చదవండి :
మట్టిని
చేతులతో మంత్రించి
దేవుని చేసారు
బతుకులు మాత్రం మార్చుకోలేదు
మట్టిని
చెమటతో తడిపి
తిండి గింజల్ని ప్రసాదించారు
వాళ్ళ కడుపులు మాత్రం నింపుకొలేక పోయారు
మట్టిని
శ్రమతో పెకిలించి
కాల్వలు చెరువులు తవ్వారు
కన్నీటికి మాత్రం కట్ట కట్టుకోలేదు
మట్టి మనుషుల
ఉట్టి ఖాళీగానే ఎప్పుడూ
మట్టి మనుషుల
బాధ శూన్యంలో శంఖం
మట్టి మనుషులు
ఓటర్ల జాబితా లోనే పదిలం.....