ఇంకా నేనెవరో మీకు అర్థం కాకపోతే నాతో పాటే వచ్చేయ్యండి అంటూ రమేశ్ కార్తీక్ నాయక్ రాసిన కవిత ' నన్ను, ఎవరని అడగకండి ' ఇక్కడ చదవండి
నన్ను ఎవరని అడగకండి
నా గురించి తెలుసుకోవాలనుకుంటే నాతో రండి
బాంబులకు పేలి ముక్కలు ముక్కలుగా పడి ఉన్న కొండలను చూపిస్తాను
ఆ ముక్కలను అడగండి
అవి చెప్తాయి నేనెవర్నో
రక్తాలేరులై పారుతున్న
నది దగ్గరికి తీసుకెళ్తాను
తొందరపడి దాన్ని ముట్టుకునేరు
ఈ భూమిని తప్పించుకొని
తన దారి తను వెతుక్కోవడానికి బయలుదేరింది
నదిలో మృత్యు కౌగిట్లో చిక్కుకున్న జలచరాలను అడగండి
అవి చెప్తాయి నేను ఎవర్నో
మా వాళ్లని మట్టి కోసం
చావుకు ఎరగా వేసి
నిర్దాక్షిణ్యంగా అక్కడే వదిలేసాము
ఇప్పుడు మేము దున్నిన ఆ నేల దగ్గరికి
మిమ్మల్ని తీసుకెళ్తాను
మేము ఎప్పుడో నాటిన విత్తనాలు
ఇంకా ఆ మట్టిలో పదిలంగానే ఉన్నాయి
ఆ విత్తనాల పక్కనే మా వాళ్ళ ఎముకలు కాపలా ఉన్నాయి
వాటిని అడగండి నా గురించి
ఆకలికి తలవంచిన మా పెంపుడు జంతువుల దేహాలను విసిరేసిన బావి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను
పచ్చదనం కోసం వాటి ఆత్మలు అక్కడే తచ్చాడుతున్నాయి
వాటికీ తెలుసు నేనెవరో
ఇంకా నేనెవరో మీకు అర్థం కాకపోతే
నాతో పాటే వచ్చేయ్యండి
నాతోనే నడవండి
మా వాళ్ళు పాడే గీతాలు వినిపిస్తాను.