బెల్లంకొండ సంపత్ కుమార్ తెలుగు కవిత: మేల్కొని ఉందాం

By telugu team  |  First Published Dec 3, 2020, 11:32 AM IST

కనిపించేది కాపలా వెలుగా లేక వ్యాపార డిస్కో కాంతా  !? మనం అజాగ్రత్తగా ఉంటే  రేపటి తరం  ప్రశ్నను మనం ఎదుర్కోక తప్పదంటూ బెల్లంకొండ సంపత్ కుమార్ తమ కవితలో ఎలా  హెచ్చరిస్తున్నారో చదవండి.


  అభయం తప్పింది ఎవరో!
   రాత్రికి పగలు
   పగటికి రాత్రి
   రెండు వారధుల నడుమ
   గమ్యం చేరాల్సిన ప్రయాణం
   ఎడారి దారితీస్తున్నది

ఎక్కడో చెట్టు మూలన
ఒక చిమ్మట పాట పాడేది
గచ్చుబాయి లేత తుమ్మ కొమ్మమీద
ఒక పక్షి అందంగా
గూడల్లేది
మరుగు గూటి పొదలల్లా
గుబురు చింత మండల్లా
బురుజు గోడలల్లా
మళ్లోచ్చే పండుగయి
ఎన్ని జీవవైవిధ్యాలు పలుకరించేవి!
ఏ చివరి చూపు
వేళ్ళ మీద లెక్కవుతున్నది!

Latest Videos

undefined

పబ్బుల మీదికి
ఊర పిచ్చుకలు రావు
అకాల దేహ మార్పు పొంది
కాకి గుడ్డు పెట్టదు
బిక్కుబిక్కుమనే కోయిలా
గొంతెత్తదు

వెచ్చని పొదుగు చుట్టు
చలువ చేపొచ్చి
గడ్డ కట్టుకున్న పాలు
కూనల గొంతు జారవు

తలమీద సారకల
చిట్టి ఉడత తల్లి
పారిపారి అలసిన తొండ
అంపశయ్య ఆయువైనై

అది కాపలా వెలుగో
లేజర్ బీమో
డిస్కో కాంతులో
వ్యాపార అలంకారికలో
తొలిచే ఉరి చిక్కు ముళ్ళల్ల
కనుగుడ్డు పిసికి పోతున్నది
కాపాడుకోలేని కంటి దుఃఖం
బొట్లు బొట్లుగా 
బొమ్మ గీసుకొని
చిత్రమై వేలాడుతున్నది

కలల శ్రామికుల మేనా మనం !
రేపటికి పిల్లలు ప్రశ్నిస్తారు 
మేల్కొని ఉందాం.

click me!