జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో 'బతుకు పుస్తకం’ అభినందన సంచిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణమూర్తికి 82 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ సంచిక ను వెలువరించారు.
హైదరాబాద్: ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణమూర్తికి 82 సంవత్సరాలు నిండిన సందర్భంగా వెలువరించిన ‘బతుకు పుస్తకం’ అభినందన సంచిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక సోమవారం రాత్రి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాళోజీ పురస్కార గ్రహీత డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ స్వాగతం పలికారు. దేవులపల్లి కృష్ణమూర్తి వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం, సీరియస్ పాఠకుడిగా ఎదిగిన తీరు, చిత్రకళ పట్ల ఆసక్తి పెంచుకోవడం, వర్గదృక్పథం ప్రభావానికి లోనుకావడం తదితర అంశాలను తన ప్రసంగంలో పేర్కొన్నారు.
బతుకుపుస్తకం గ్రంథాన్ని ఆవిష్కరించిన ప్రముఖ కవి, మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మీయత, క్రమశిక్షణ, గొప్పవ్యక్తిత్వం గురించి వివరించారు. రెవెన్యూ ఉద్యోగిగా ఉంటూ కూడా తన సెన్సివిటీని కాపాడుకున్న తీరును ప్రశంసించారు. వ్యాస సంకలనం చదివి ఆనందించానని చెబుతూ అందులోని వ్యాసాలను విశ్లేషించారు. కేశవరెడ్డితో సరితూగగలిగే రచనలు చేశారని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు ఆచార్య చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ దేవులపల్లి కృష్ణమూర్తి వేయి పున్నముల వేడుక కానుక బతుకు పుస్తకం అన్నారు. దేవులపల్లి బతుకునుంచి వచ్చిన రచయిత, ఇతరుల బతుకులను పరిశీలించిన రచయిత . పైగా చిత్రకారుడు. కాబట్టి తన రచనల్లోని పాత్రలన సజీవ చిత్రాలుగా మలిచారని అన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ... చేనేత కళాకారుల కృషిని చిత్రించిన తీరు ఉన్నతంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. దేవులపల్లికి తనదైన రచనా శైలి అత్యంత సహజంగా అలవడిందని, ఎక్కడా నేర్చుకోలేదని అన్నారు. తన రచనల్లో సామాజిక సమస్యలను తూర్పారబడుతూనే మానవజీవితంలోని ఉత్తమ విలువలను కూడా చిత్రించి, వాటిని అనుసరించాల్సిన విధానాన్ని చెప్పారని అన్నారు. సామల సదాశివకు కొనసాగింపు దేవులపల్లి కృష్ణమూర్తి అని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ రచయితలు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, డాక్టర్ వి జయప్రకాశ్ సమన్వయం చేశారు. కెపి అశోక్ కుమార్, తిరునగరి దేవకీదేవి, సంగిశెట్టి శ్రీనివాస్, డా.నోముల రాహుల్, నర్సిం, డా. నాగేశ్వరాచారి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.