సిఎస్ రాంబాబు కవిత: కనపడటంలేదు

By telugu team  |  First Published Oct 20, 2019, 11:50 AM IST

నిన్నటిదాకా రొదగా వినిపించేది ఆ ఎర్రబస్సుయ/ ఇప్పుడో రోదనగా మారిపోయింది/ ఇరుపక్షాల యుద్ధంలో వేదనగీతమయింది/ దారంతా ద్వీపాలై మనుషులు అని అంటున్నారు కవి సిఎస్ రాంబాబు


నిన్నటిదాకా రొదగా వినిపించేది ఆ ఎర్రబస్సు
ఇప్పుడో రోదనగా మారిపోయింది
ఇరుపక్షాల యుద్ధంలో వేదనగీతమయింది
దారంతా ద్వీపాలై మనుషులు

బస్సంటే కస్సుబుస్సులాడే నాయకుడు
కాలే కడుపుల ఆకలి చూస్తాడా
జనసంద్రంలో నావలై గమ్యం గుమ్మాలకు
తోరణాల్లా ఉండేవి

Latest Videos

ఎర్రటి ఎండలో చుర్రుమన్న పాదాల్లా
బిగిసిన పిడికిళ్లు..ఎగసిన కొడవళ్ళలా
ఇది కోడిపందాలాట కాదు కదా
కానీ మనుషులు ప్రాణాలే పణంగా పెడుతున్నారు

ఎక్కడో వేడిగాలి వీస్తోంది
పైనో నల్లని మేఘం నీడలా విస్తరిస్తోంది
నాలుగు చినుకులను చల్లుతుందేమో
నాలుగు మంచిమాటలతో సంధికుదిర్చే మనుషులే
కనపడటంలేదు

- సి.యస్.రాంబాబు

click me!