సకల ఆధిపత్యాలను దిక్కరిస్తేనే ధీరత్వం అని కరీంనగర్ నుండి అన్నవరం దేవేందర్ అందిస్తున్న కవిత 'ఆధిపత్యం' ఇక్కడ చదవండి.
ఆధిపత్య అంకురానికి ఆదినుంచే పైత్యం
మొలకెత్తిన చిగుర్లకు అహం వాసన
రెమ్మ రెమ్మలుగా విస్తరించిన ముళ్ళ తీగ
కడప లోపలే మొదలవుతుంది ప్రతాపం
తొలుత మగ పురుగు రూపంలోనే తొలుస్తది
గాయమైతది కానీ నెత్తురు తెలువది
పెనిమిటి ఎట్లాగూ పెత్తతనపు మారుపేరు
అధికారం అత్త రూపంలోని అగ్రహ స్వరం
ఓరిమితో ఒదిగినా నెత్తి మీద ఒత్తిడి
పని చేసే చోట పైవాడొక పచ్చని సర్పం
మాట మాటల్లోనూ బుస బుసల కాలుష్యం
అన్ని కార్యాలయాలూ మగనీతుల నిచ్చెన మెట్లు
పెద్దతనపు గౌరవం గానుగెద్దు వర్తులం
మర్యాదల రూపం భుజం దిగని దాసోహం
ఆలోచనల స్వేచ్ఛకు తరతరాల ఆటంకం
దాచి ఉంచేందుకే ఆచారమైన వ్యూహం
ఆచరిస్తున్నంత వరకే పరంపరల పర్వం
స్వతంత్ర ధార మొదలైతే పటాపంచలే
సకల ఆధిపత్యాలను దిక్కరిస్తేనే ధీరత్వం.