నల్ల మబ్బు కాన్పున రంగుల వంతెనను కన్నట్టు అంటూ అహోబిలం ప్రభాకర్ రాసిన కవిత " నిలకడ లేని నిజం " ఇక్కడ చదవండి :
నిన్న ఏదో పెద్ద ఏడుపు
ఈ రోజు ఆనందాన్ని కంటుంది
ఇంతలోనే వింత కోరిక
ఆకలి పుట్టకముందు
ఈ అలికిడి ఎప్పుడు వెన్నంటే
ఎప్పుడూ దేవులాట చుట్టే
అది మనిషికీ మట్టికీ
పుడుతూ పిడికిలి బిగింపు
పడి లేస్తూ ఎన్నిసార్లు
పరికించాము
చివరి పంపకాలైన తరువాత
తెరిచిన చేతుల గీతలు
ఇంకా ఇక్కడ బాకీ పడ్డట్టు
ఒకటి నిజం అనిపించొచ్చు
పరుచుకున్న మబ్బులు
రుజువులు లేవు
కురిసిన దార కూడా అంతులేదు
ఇటునుండి అటు ఆకాశమో
అటునుండి ఇటు అగాధమో
రెండూ వొంటరి తనాన్నిగన్నవే
కనిపించేది భ్రమే
నల్ల మబ్బు కాన్పున
రంగుల వంతెనను కన్నట్టు
బిడ్డ చనుబాలకు
తల్లి కండ్లు దుమికిన మత్తడైనట్టు
గాలికి రెక్కలు మొలిచినప్పుడూ
మంచు పొర తేరుకోక తప్పదు
నిదుర మబ్బుఅంతే
ఆ దృశ్యాలు మెల్లమెల్లగా
కనుమరుగు అగుటే