ఈ రోజు డా. నందిని సిధారెడ్డిచే రవీంద్ర భారతి మినీ హాలులో నక్క హరికృష్ణ కవితా సంపుటి " అవిరామం " ఆవిష్కరించబడుతున్న సందర్భంగా బెల్లంకొండ సంపత్ కుమార్ రాసిన ఆసక్తికరమైన వ్యాసం ఇక్కడ చదవండి :
సింగన్న గూడ అనే ఒక చిన్న గ్రామం నుండి నక్క హరికృష్ణ చదువుకొని విద్యావంతుడై రచనా రంగాన్ని ఎన్నుకున్నాడు. బీదరికమైన కుటుంబం నుండి ప్రారంభమయ్యాడు. ' అవిరామం ' కవితా సంపుటి ఆయన మొదటి కవిత్వ ప్రచురణ అయినప్పటికీ ఇది రెండవ పుస్తకం. మొదట ' పరామర్శ ' అనే పరిశోధనాత్మక వ్యాస సంపుటి ప్రచురించాడు. ఆ వ్యాస సంపుటిలో ఆంధ్ర జన సంఘము నుండి, ఆంధ్ర మహాసభలు మరియు తెలంగాణ ఉద్యమం ఇవాళటి కొత్త రచయితల దాకా వ్యాసాలు ఉన్నాయి. అవి వివిధ విశ్వవిద్యాలయాలకు సమర్పణ చేసినవే.
మరొక ముఖ్య విషయమేమంటే, ప్రపంచ మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన పరిశోధనాత్మక వ్యాస పోటీలో బహుమతి పొందిన వ్యాసం కూడా ఈ సంపుటిలో ఉంది. హరి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన కవిత్వ పోటీలలో బహుమతి పొందాడు. అలాగే వ్యాసరచన పోటీలో ఎంపిక కాబడ్డ రచనలు ఉన్నాయి.
ఈ రోజు డా. నందిని సిధారెడ్డిచే ఆవిష్కరించబడుతున్న " అవిరామం " కవితా సంపుటి హరి నిరంతర సాధనకు చిహ్నం. డాక్టర్ నందిని సిధారెడ్డి సార్ ఈ పుస్తకానికి హృదయ గాత్రం అనే ముందుమాట రాస్తూ అంతరంగం పొంగినప్పుడు రాసుకున్న కవితలన్నీ ' అవిరామంగా ' ప్రకటిస్తున్నాడు నక్క హరికృష్ణ అని తెలిపారు. ఈ పుస్తకంలో తెలంగాణ సంస్కృతిపై, పర్యావరణంపై మానవీయ విలువలపై, మానవ సంబంధాలపై, దేశభక్తి పైన, అవినీతిపైన, కరోనాపైన సూచింపదగిన కవితలు ఉన్నాయి.
హరికృష్ణ మొదటినుండి కవిత్వం రాయటంలో ధ్యాస పెట్టాడు. అమ్మ నాన్నల మీద కవిత్వం రాశాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యమ సందర్భంలోనూ కవిత్వం రాశాడు. తెలంగాణ ముచ్చట ఒడవంది. ఆనాటి గోస ఎంత ఎల్లబోసినా ఇంకా మిగిలే ఉంటది అన్నట్టుగా వెతలు ఉన్నాయి. అది రాజకీయ కోణంగా ప్రజల ఉద్యమానికి బాట వేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం రాసిన కవిత్వం కూడా అవిరామంలో ఉంది. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఈ కవితా సంపుటికి రాసిన ముందుమాటలో కవిత్వంలోకి దిగటం ఈజీగా కనిపిస్తుంది కానీ, కవిత్వంతో బతకడం అంత ఈజీ కాదు అన్నారు. ప్రతిభకు పదును పెట్టుకుంటూ నిరంతర సాధన ఉంటేనే తప్ప కవిత్వంతో ఉండలేడు. అట్లా కవిత్వాన్ని శ్వాసగా ఏర్పరచుకోగల కవికి తిరుగు లేదు. నక్క హరికృష్ణ ఆ మార్గంలోనే నడుస్తున్నాడని చెప్పటానికి ఆయన అవిరామం ఒక సాక్ష్యం.
సాహిత్య సృజన హరి నిరంతరం కొనసాగించాలని అనుభవజ్ఞులైన సీనియర్ కవులు చెపుతున్నారు. ఈ సూచనను హరి అక్షరాల పాటిస్తాడని విశ్వసిద్దాం. ఈ రోజులలో కూడా విద్యకు దూరమై మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్న సామాజిక పరిస్థితులను నాటకంగా రచించి బడి పిల్లలతో ప్రదర్శింపజేశాడు హరి. ఏ సంకుచిత పరిధిలోకి లోపడకుండా విశ్వజనీనమై ప్రయోజనవంతమైన కవిత్వం రాయాలని, నిరంతరం విద్యార్థిగా అధ్యయనం చేస్తూ ఉండాలని హరికృష్ణకు ఒక మంచి మాట తెలియజేస్తూ అభినందనలు.