కవి సమాంతర కాలాన్ని అధ్యయనం చేస్తూ దానితోపాటు కలిసి అడుగులు వేసినప్పుడే అత్యుత్తమ కవిత్వాన్ని అందించగలడని తెలంగాణ రాష్ట్ర కాళోజీ పురస్కార గ్రహీత ప్రముఖ కవి కోట్ల వేంకటేశ్వర రెడ్డి అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం, ప్రజా భారతి సంయుక్త నిర్వహణలో యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ఉన్నత పాఠశాల వేదికగా కవి తోట వెంకటేశ్వర రావు కవితా సంపుటి ' కాలం కూడా ... ' ఆవిష్కరణ కార్యక్రమం నిన్న జరిగింది. భువనగిరికి చెందిన కవి, విశ్రాంత ఉపాధ్యాయుడు తోట వెంకటేశ్వరరావు వచన కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో కవి కోట్ల వేంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కవితా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యత కలిగిన తోట వెంకటేశ్వరరావు గత కొన్ని దశాబ్దాలుగా మంచి కవిత్వం రాస్తూ వస్తున్నారని, ఆ క్రమంలో భిన్న వస్తువులను తీసుకుని తనదైన శైలిలో సాహిత్య ప్రియుల అభిమానాన్ని చూరగొంటున్న ఘనత తోట వెంకటేశ్వరరావుకు దక్కుతుందన్నారు. కాలంతో పాటు పయనిస్తూ కాలాన్ని తన కవిత్వంలో ప్రతి బింబించే కవి చిర కాలంగా కవితాక్షరమై నిలిచిపోతారని అన్నారు.
డాక్టర్ పోరెడ్డి రంగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కవులు బాలకుల్ల శ్రీకాంత్, దేవినేని అరవింద రాయుడు, పెసరు లింగారెడ్డి, పాండాల మహేశ్వర్ , గజ్జల రామకృష్ణ, బండి సూర్యా రావు, పలుగుల సతీష్, బాలకుల్ల శ్రీరాములు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.