తెలంగాణ ఉద్యమకారుడు కవి, రచయిత, హక్కుల గొంతుక నల్లెల రాజయ్య అకాల మరణం ఓరుగల్లు సాహిత్య లోకానికి తీరనిలోటని తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొట్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి బిల్ల మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుడు కవి, రచయిత, హక్కుల గొంతుక నల్లెల రాజయ్య అకాల మరణం ఓరుగల్లు సాహిత్య లోకానికి తీరనిలోటని తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొట్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి బిల్ల మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్లెల రాజయ్య (62) ఈ రోజు ఉదయం గుండె, శ్వాస సంబంధిత సమస్యలపై హన్మకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన రాజయ్య ఉద్యోగ విరమణ అనంతరం పూర్తి స్థాయి హక్కుల కార్యకర్తగా పని చేస్తున్నారు. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపైన, బాలికల, స్త్రీల పైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజాన్ని నిత్యం చైతన్య పరుస్తున్న రాజయ్య మృతి పట్ల హన్మకొండ పట్టణంలోని పలు సంఘాలు విచారం వ్యక్తంచేశాయి.
పట్టణంలోని చెరువుల ఆక్రమణ, అక్రమ కట్టడాలపై నిత్యం తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేసేవారు. వరంగల్ రచయితల సంఘం ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి తన సంపాదకత్వంలో విలువైన రచనలను సమాజానికి అందించడమే కాకుండా వివిధ ఉద్యమాల సందర్భంలో తనదైనరీతిలో గొంతెత్తి అందరిలో స్ఫూర్తినింపాడని పలు సాంస్కృతిక, సాహిత్య సంస్థలు రాజయ్యతో తమకు గల జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
తెరసం సభ్యులు నెల్లుట్ల రమాదేవి, నాగిళ్ళ రామశాస్త్రి, హాజీనురానీ, బాలబోయిన రమాదేవి, ఉదయశ్రీ ప్రభాకర్, కార్తీకరాజు, సిరాజుద్దీన్, వకులవాసు తదితరులూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.