ఆస్తులను కూడబెట్టిన మనుష్యులకన్న ఆకలిదీర్చిన చేతులే గుర్తుంటయి అంటూ అవనిశ్రీ రాసిన కవిత ' వడ్ల జయక్క ' ఇక్కడ చదవండి :
నా చిన్నప్పటి సంది చూస్తున్న
ఊరికాని ఊరొచ్చి బువ్వకోసం దేవులాడుతుంటే
కొత్త సంచి కుట్లుఇప్పి
రెండు సేర్ల బియ్యంబోసి ఆకలైన కడుపులకు
అన్నంబెట్టిన ఆ సెయ్యి ఇస్తారాకు అయ్యేది
నేను సదువుకునేటప్పుడు
బొడ్డుగిన్నెలో బువ్వబెట్టి కారం పొడి కలిపి తింటుంటే
రోజూ కారంబువ్వ తింటే
కడుపుల పేగులు పాడైతాయిరా అనీ
అరచేతిలో కూరేసి
ఆ పూటకు కడుపు నింపిన కరుణామయ తల్లి
ఇల్లిల్లు బట్టలు మూటకట్టుకొచ్చిన సాకలమ్మ
పయిటాల పొద్దుకు ముద్దదిగాలంటే
ఊరంత ఎవరు బువ్వపెట్టకపోయిన
ఆ ఇంట్లో మెతుకుల మీద మా పేర్లు రాసింటాయని సాకలమ్మ నోర్లు ఆ గుమ్మం ముందర బువ్వను మింగుతుంటయి.
ఇంటి పక్కల
కొడుకులు వేరు చేసిన ముసలోళ్ళు
వండుకోలేని రోజు జయక్క చేతులే
పట్టెడన్నం బెట్టి ఆ గుండెలకు
కొడుకులున్న కూడుబెట్టని లోటును భర్తీ చేస్తుంటది
ఇప్పటికీ
పల్లెమీద పండువెన్నెల కాస్తుందంటే
తుమ్మకొమ్మలమీద తూనీగలు వాలుతుందంటే
కడుపుగాలిన పిల్లిలా తిరిగే పేగుల్లో
సల్లపోసే వడ్ల జయక్క సేతుల చలువనే అనుకుంటా.!
కంచం పట్టుకొని అమ్మా..ఇంత బువ్వ పెట్టండమ్మా
పిల్లలు ఉపాసంతో ఉన్నారంటే
తింటున్న కూడ లేసొచ్చి ఉడుకుడుకు బువ్వ
బిచ్చగత్తె గిన్నెనింపే మనసుగల్ల తల్లీ.!
ఆస్తులను కూడబెట్టిన మనుష్యులకన్న
ఆకలిదీర్చిన చేతులే గుర్తుంటయి
పల్లెకు పునాదులేసి కట్టినవాళ్లకన్న
పట్టెడన్నంబెట్టిన గుండెలే చరిత్రంత నిల్చిపోతయి.