బతుకమ్మ పండుగ స్పెషల్ చింతపండు పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..

By Mahesh RajamoniFirst Published Sep 20, 2022, 3:04 PM IST
Highlights

బతుకమ్మ స్పెషల్ గా ఎన్నో వంటలను చేసుకుంటాం.. కానీ అందులో చింతపండుతో చేసిన పులిహోరే బలే టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ.. తినాలనిపించే చింతపండు పులిహోరను టేస్టీగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 
 

చాలా మంది బతుకమ్మ స్పెషల్ గా తీరు తీరు వంటలను చేసుకుని తింటుంటారు. అయితే వీటన్నింటిలో చింతపండుతో చేసిన పులిహోరే బలే టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎంత తిన్నా.. ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుందది. అందుకే ఈ బతుకమ్మ స్పెషల్ గా చింతపండు పులిహోరను ట్రై ఇలా చేయండి. ఇంగువ, మిరియాల పొడి, వేరుశెనగలతో చింత పండు పులిహోరను తయారుస్తే.. లొట్టలేసుకుని లాగిస్తారు. మరి దీన్ని ఎలా తయారుచేయాలి.. దీనికి కావాల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం పదండి. 

కావాల్సిన పదార్థాలు

అరకిలో బియ్యం, నీళ్లు తగినన్ని, 1 టీ స్పూన్ పసుపు, నాలుగు పచ్చి మిరపకాయలు, చింతపండు 50 గ్రా, రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ ఇంగువ, రెండు టీ స్పూన్ల మినప పప్పు, నూనె పావు కిలో,  నాలుగు ఎండు మిరపకాయలు, అరకప్పు పల్లీలు, మిరియాల పొడి టీ స్పూన్, రెండు టీ స్పూన్ల శెనగ పప్పు , టీ స్పూన్ ఆవాలు, రెండు రెబ్బల కరివేపాకు, టీ స్పూన్ ఇంగువ. 

తయారీ విధానం

ముందుగా బియాన్ని కడిగి ముప్పై నిమిషాలు నానబెబ్టండి. అలాగే చింత పండును కూడా నానబెబ్టండి. ఆ తర్వాత బియ్యాన్ని తీసుకుని.. అవి ఉడికేందుకు సరిపడా నీళ్లను పోయండి. దానిలో టీ స్పూన్ నూనె, అరటీస్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పును వేసి స్టవ్ పై పెట్టండి. ఇక  అన్నం అయిన తర్వాత వెడల్పాటి గిన్నెలో వేసి అన్నం అతుక్కోకుండా ఆరబెట్టండి. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టి.. అందులో చింతపండు గుజ్జును వేయండి. దీనిలోనే పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేయండి. 10 నిమిషాల తర్వాత దీన్ని దించి పక్కన పెట్టుకోండి. 

స్టవ్ పై మరో కడాయిని పెట్టుకుని.. నూనె పోయండి. ఈ నూనె వేడి అయ్యాక అందులో మినప పప్పు, శెనగలు, పల్లీలను వేసి బాగా వేగనివ్వండి. ఆ తర్వాత వీటిలో.. ఎండుమిర్చి, ఆవాలు, మిరియాల పొడి, ఇంగువ, కరివేపాకులు, పచ్చి మిర్చి వేయండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కిందికి దించిపెట్టుకోండి.  చింతపండు గుజ్జును తీసుకుని ఆరబెట్టిన అన్నంలో కలపండి. ఆ తర్వాత తాళింపును కూడా వేసి మొత్తం కలగలిసేలా కలపండి. అంతే టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయినట్టే. మీకు తెలుసా.. ఈ పులిహోర రెండు రోజులైనా పాడవదు. 

 

click me!