''వైన్స్ షాపుల కోసం భారీ దరఖాస్తులు...కార్యాలయాల వద్ద బారికేడ్ల ఏర్పాటు''

By Arun Kumar PFirst Published Oct 15, 2019, 8:04 PM IST
Highlights

కరీంనగర్ జిల్లాలో వైన్స్ షాప్స్ దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ జిల్లానుండి ఎక్సైజ్ శాఖకు భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకోగా చివరిరోజు భారీగా దరఖాస్తులు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  

తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన గడువు రేపటి(బుధవారం)తో ముగియనుంది. అయితే ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో భారీస్థాయిలో దరఖాస్తులు అందగా రేపు మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని డిపిఈవో చంద్రశేఖర్ పేర్కొన్నారు. అందువల్లే దరఖాస్తులు స్వీకరించే కార్యాలయాల వద్ద బారీకేడ్లను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

దరఖాస్తులకు చివరి రోజు కావటంతో ఆసక్తిగలవారు విశేషంగా వచ్చే అవకాశం ఉందని...   దానికి తగినట్లు రద్దీని తట్టుకోవడం కోసం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.  బారికేడ్లతో పాటు మంచినీటి సౌకర్యం, టెంట్ వసతి ఏర్పాటు చేశామని వెల్లడించారు. 

ఇప్పటికే నిర్దేశించిన అన్ని ప్రాంతాలనుండి దరఖాస్తులు అందగా జమ్మికుంట టౌన్ లో 3, గన్నేరువరం మండలంలోని హన్మాజీపల్లి, కరీంనగర్ రూరల్ పరిధిలోని బొమ్మకల్,చెర్లబూత్కూర్ దుకాణాలకు దరఖాస్తులు రావాల్సివుందన్నారు. రేపు సాయంత్రం 4 గంటలలోపు లైన్ లో ఉన్నవారి దరఖాస్తులు మాత్రమే అనుమతించబడతాయని చంద్రశేఖర్ తెలిపారు. 

ఇక దరఖాస్తుల స్వీకరణలో ఆరవ రోజైన ఇవాళ కరీంనగర్ జిల్లా పరిధిలో మొత్తం 288  దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఇలా మొదటిరోజు నుండి ఇప్పటివరకు    మొత్తం  618 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. 

 సర్కిళ్ల వారీగా వచ్చిన దరఖాస్తులు..

కరీంనగర్ అర్బన్ పరిధిలోని మొత్తం షాప్స్ 21...ఈ రోజు వచ్చిన దరఖాస్తులు 69..ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు139. 
కరీంనగర్ రూరల్ సర్కిల్ లో మొత్తం షాప్స్ 25...ఈరోజు వచ్చిన దరఖాస్తులు 57.. ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 153. 
తిమ్మాపూర్ సర్కిల్ పరిధి లోని మొత్తం షాప్స్ 12...ఈరోజు వచ్చిన దరఖాస్తులు 91...ఇప్పటి వరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 178.

హుజురాబాద్ సర్కిల్ పరిధిలోని మొత్తం షాప్స్ 15...ఈరోజు వచ్చిన దరఖాస్తులు 47..ఇప్పటి వరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 104.
జమ్మికుంట సర్కిల్ పరిధిలోని మొత్తం షాప్స్ 14..ఈరోజు వచ్చిన దరఖాస్తులు 24.. ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 44 వచ్చాయని తెలిపారు. 
 

click me!