ఏం జరుగుతుందో కేసీఆరే చూస్తారు...: టి బిజెపి చీఫ్ బండి సంజయ్ హెచ్చరిక

By Arun Kumar P  |  First Published Mar 11, 2020, 6:53 PM IST

విద్యాార్థుల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబివిపి)కి చెందిన విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఖండించారు. 


కరీంనగర్: రాష్ట్రంలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఖండించారు. కేవలం విద్యారంగ సమస్యలను పరిష్కరించమని అడిగితే ఇష్టం వచ్చినట్టు చితకబాదుతారా? అని ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. 

ఇచ్చిన హామీలు నిలుపుకోమని... సమస్యలు పరిష్కరించమని అడిగితే తప్పా? అని ప్రశ్నించారు. వాళ్ళు విద్యార్థులు అనుకున్నారా లేక సంఘ విద్రోహశక్తులు అనుకుంటున్నారా? అని నిలదీశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య పాలనే నడుస్తోందా... లేక నిజాం పాలననా? అని విమర్శించారు.

Latest Videos

undefined

read more  టీ అసెంబ్లీ గేటెక్కిన ఎబీవీపి కార్యకర్తలు: ఉద్రిక్తత (ఫొటోలు)

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఉద్యోగాల్లేవ్ ఏమీ లేవంటావా? అని ప్రశ్నించారు. విద్యార్థులపై పోలీసులను ఎగేసి నువ్ మాత్రం ఫార్మ్ హౌస్ లో సేద తీరుతున్నావా అని కేసీఆర్ ను నిలదీశారు.  

ఏబీవీపీ విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్ధి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో కెసిఆర్ కే బాగా తెలుసని అన్నారు. 

read more  తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

ఉద్యమకారుడినని చెప్పుకునే నువ్వు విద్యార్థి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల తలలు పగలకొట్టేంత కక్ష ప్రభుత్వానికి ఎందుకని అన్నారు. విద్యార్ధులు తిరగబడితే ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో చూస్తారని టి బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ హెచ్చరించారు. 

click me!