రాధిక హత్య మిస్టరీ... రంగంలోకి స్పెషల్ క్లూస్ టీం

By Arun Kumar PFirst Published Feb 13, 2020, 7:12 PM IST
Highlights

కరీంనగర్ లో సంచలన సృష్టించిన ఇంటర్మీడియట్ విద్యార్థిణి రాధిక హత్య కేసులో ఆధారాలను సేకరించేందుకు స్పెషల్ క్లూస్ టీం రంగంలోకి దిగింది. 

కరీంనగర్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరీంనగర్ ఇంటర్ విద్యార్ధిని రాధిక హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే హత్య జరిగి గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో ఉన్నతాధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. సంఘటన స్థలంలో దొరికిన కత్తిపై హంతకుడి వేలిముద్రల కోసం పరిశీలించినప్పటికీ ఫలితం దొరకలేదు. చివరికి డాగ్ స్క్వాడ్‌‌ను రప్పించి అణువణువు గాలించినా ఎలాంటి క్లూ లభించకపోవడంతో పోలీసు అధికారులకు సైతం అంతుచిక్కడం లేదు.

దీంతో హైదరాబాద్ కు చెందిన నిపుణులైన క్లూస్ టీంను రప్పించారు పోలీసులు. క్రైమ్ సీన్ ఆఫీసర్(సీఎస్‌వో) ఇంద్రాణి ఆద్వర్యంలో  5 మంది సభ్యుల బృందం మృతురాలి ఇంటిని సందర్శించి కీలకమైన ఆధారాలు సేకరించారు. 

ఈ ఇన్వెస్టిగేషన్ లో అత్యాధునికమైన జర్మన్ టెక్నాలజీ ని ఉపయోగించి రక్తం మరకలు కడిగినా తెలుసుకొనే సదుపాయం, 3D క్రైమ్ సీన్ ఫోటోగ్రఫి, వీడియో గ్రఫీ,   3D స్కానర్ మరియు బాడి ప్లూయిడ్ కిట్ లను ఉపయోగించి ముఖ్యమైన ఆధారాలు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ లాబ్ కు పంపడం జరిగింది. వాటిని సాధ్యమైనంత తొందరలో విశ్లేషించి నిందితున్ని పట్టుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. 

read more ఆగని ప్రేమోన్మాదుల ఆగడాలు... కరీంనగర్ లో మరో యువతి బలి

మరోవైపు  ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీ కమలాసన్ రెడ్డి నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితోనే హత్య చేయడంతో.. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదని, తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

 అయితే హత్యకు ఉపయోగించిన కత్తికి రక్తం మరకలు లేకపోవడంతో... హత్యచేసిన తర్వాత కత్తిని శుభ్రం చేసి ఉంటారని భావిస్తున్నారు. నిందితుడు హత్య చేసే ఉద్దేశ్యంతో రాలేదని... అనుకోని పరిణామం తలెత్తడంతో హత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో చూస్తున్నారు. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు ముత్త ఓదెమ్మ- కొంరయ్యలు మాత్రం తమ ఇంట్లో కిరాయికి ఉండి, ఖాళీ చేసిన వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తమ కూతురు స్నేహితురాలి కుటుంబం గత కొద్ది నెలలుగా తమ ఇంట్లో కిరాయికి ఉండేదని... అయితే... స్నేహితురాలి తండ్రి పోచాలు రోజు తాగివచ్చి ఇంట్లో న్యూసెన్స్ చేసేవాడని... అంతే కాకుండా... ఈ మధ్య కొత్త వారిని కూడా ఇంటికి తీసుకువస్తుండడంతో వారిని బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించామని చెబుతున్నారు.

పోచాలు కుటుంబ సభ్యులు ఎవరైనా... ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకుని హత్యకు పాల్పడ్డాడేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి మర్డర్ పై మరో రకమైన కథనం కూడా కొనసాగుతుంది.

రాధికకు ఈ మధ్యే ఓ అబ్బాయి ప్రపోజ్ చేశాడని కానీ ఆమె అందుకు అంగీకరించకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పలువురు చెబుతున్నారు. మరోవైపు రాధిక కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి గంగుల కమలాకర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

click me!