బలగం మొగిలయ్యకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆపన్నహస్తం అందజేశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి సహాయనిధినుంచి సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
కరీంనగర్ : ఇటీవల విడుదలైన బలగం సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలంగాణ ప్రజా జీవితాన్ని.. అనుబంధాలను చక్కగా దృశ్యమానం చేసిన ఈ సినిమా విపరీతంగా ప్రేక్షకాదరణను అందుకుంది. "బలగం" సినిమాలో చివరి ఎమోషనల్ పాట పాడి అందరిని ఆకట్టుకున్నారు పస్తం మొగిలయ్య. ఆయన నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు. పస్తం మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతూ డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తక్షణమే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చికిత్స పూర్తయ్యేవరకు వైద్య ఖర్చులకు ఎన్ని లక్షలైన సరే లైన్ఆప్ క్రెడిట్ చెక్ (ఎల్ఓసీ) ద్వారా అందజేస్తామని, ఎల్ఓసీ ప్రొసీజర్ వెంటనే ప్రారంభించి ఒకటి/రెండు రోజుల్లో వైద్యం కొరకు మొగిలయ్యను హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు చేయాలని, ఇట్టి బాధ్యతను స్థానిక నాయకులు రైతు సమన్వయ సమితి బాధ్యులు తోకల నరసింహారెడ్డి గారికి అప్పగించారు.
మొగిలయ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారు త్వరగా తిరిగి కోలుకుని తన కళ ద్వారా తెలంగాణ సంస్కృతికి జీవంపోసి అనేక మందిని అలరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశించారు.