అలా అంతం చేయడం అసదుద్దిన్ అబ్బతరం కూడా కాదు: బండి సంజయ్

By Arun Kumar PFirst Published Jan 18, 2020, 8:29 PM IST
Highlights

ఎంఐఎం పార్టీ నాయకులు అసదుద్దిన్ ఓవైసీపై బిజెపి ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. బిజెపి అంతం చేయడం అసదుద్దిన్ వల్ల కాదు ఆయన అబ్బతరం కూడా కాదని ఘాటు వ్యాఖ్యలతో విమర్శించారు. 

కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ టిఆర్ఎస్ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ   రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం,  తాజా రాజకీయ పరిణామాలపై ఎంపీ బండి సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఏడు నెలల్లో కేంద్రం నుంచి ఎంపీ ఎన్ని నిధులు తీసుకువచ్చారని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించడం హాస్యాస్పదమని అన్నారు. తన వద్ద ఐదేళ్ల ప్రణాళిక ఉందని తెలిపారు. పన్నెండేళ్లుగా  కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధి ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు. 

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఏళ్ల తరబడిగా చెబుతున్నప్పటికీ ఎందుకు ఆచరణకు నోచుకోవడం లేదని అన్నారు. అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.  రోడ్లు వేస్తూ మళ్లీ తవ్వుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కూడళ్ల విస్తరణ, కుదింపు పనుల్లోనూ అవినీతి అక్రమాలు జరిగాయని అన్నారు.

read more  గెలుపు కాదు... ఆ పార్టీలకు అభ్యర్థులే కరువు: మంత్రి కొప్పుల సెటైర్లు

మిషన్ భగీరథ కోసం ఖర్చు చేస్తున్న నిధులు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా ఇచ్చినవి కాదా అని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కనీసం ప్రధానమంత్రి ఫోటో పెట్టాలనే కనీస విజ్ఞత కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు లేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరిన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం అసంబద్ధ నిర్ణయమని అన్నారు.

 గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 14వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఎంపీ విమర్శించారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులను ఆర్థిక సంఘం నిధులతో ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు.  మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించకపోతే మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు పోతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరించడంతో టీఆర్ఎస్ నేతలు అడ్డదారుల్లో గెలవడం కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

read more  వేములవాడ ఆలయానికి వెళితే మంత్రి పదవి ఊడుతుందా...!: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లో మైనారిటీలుగా  హింసకు, అణచివేతకు గురై భారత్ కు శరణార్థులుగా వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు  పౌరసత్వం ఇచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించిందని బండి సంజయ్ అన్నారు. ఈ చట్టంతో భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసం టీఆర్ఎస్, ఎంఐఎం ఉద్దేశపూర్వకంగానే ఆందోళనలు చేపడుతున్నారని మండిపడ్డారు. 

సీఏఏలో ముస్లింలను చేర్చాలని  డిమాండ్ చేస్తున్న పార్టీలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో ముస్లింలు మైనారిటీలుగా కాదనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ పతనం కరీంనగర్ నుంచే ప్రారంభమవుతుందన్న అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీని అంతం చేయడం అసదుద్దీన్ అబ్బ తరం కూడా కాదని ధ్వజమెత్తారు.

సీఏఏ ద్వారా పొరుగు దేశాల్లోని ముస్లింలకు భారత పౌరసత్వం ఇస్తే భారత్ లోని ముస్లింల విద్య, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని ముస్లిం మత పెద్దలు చెబుతున్న విషయం ప్రజలంతా గమనించాలని అన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ పిలుపునిచ్చారు. 
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, మాజీ మేయర్ డి.శంకర్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టె మురళీ కృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ నేతలు కన్న కృష్ణ, సంపత్, సుజాత రెడ్డి  పాల్గొన్నారు.

 

click me!