ఎక్కువ మందిని కనాలి.. లేదంటే నాగరికతకే ముప్పు: ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Aug 29, 2022, 8:19 PM IST
Highlights

టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి చిన్నపిల్లల సంక్షోభం అని వివరించారు. జనానల రేటు తగ్గితే ప్రపంచ నాగరికతకే ముప్పు అని తెలిపారు. పిల్లలను కనాలని అన్నారు. అలాగే, ఇంకొంత  కాలానికైనా ప్రపంచానికి మరిన్ని శిలాజ ఇంధన వనరుల అవసరం ఉన్నదని వివరించారు.
 

న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుడు, బిలియనీర్ టెక్ ఎంటర్‌ప్రెన్యూవర్ ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పది మంది పిల్లలకు జన్మనిచ్చిన ఎలన్ మస్క్.. ఈ ప్రపంచానికి ఇంకా పిల్లల అవసరం ఉన్నదని అన్నారు. చమురునూ ఇంకా తవ్వి తీయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

జననాల రేటు తగ్గిపోతే నాగరికతనే ప్రమాదంలో పడిపోతుందని హెచ్చరించారు. ప్రపంచం ప్రస్తుతం బేబీ క్రైసిస్ ఎదుర్కొంటున్నదని వివరించారు. చిన్న పిల్లల సంక్షోభం ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటని విలేకరుల ఆయనను అడిగారు. దీనికి సమాధానంగా ఈ విషయంలో తాను ఎక్కువ ఆలోచించే విషయం జననాల రేటు అని వివరించారు.

ప్రపంచ జనాభా తగ్గకుండా చూసుకోవాలని.. లేదంటే చివరకు అందరూ అంతరించిపోయే ముప్పు ఉన్నదని అన్నారు. కనీసం జనాభా నిలకడగా సాగేలా అయినా పిల్లలను కనాలని తెలిపారు. సరిపడా పిల్లలను కనకుంటే జనాభా ఒక్కసారిగా లేదా.. క్రమంగానైనా కనుమరుగైపోతుందని అభిప్రాయపడ్డారు. 

అంతేకాదు, ఈ ప్రపంచానికి ఇంకా శిలాజ ఇంధన వనరులు అవసరం అని ఎలన్ మస్క్ అన్నారు. స్వల్పకాలికంగానైనా శిలాజ ఇంధనాలు.. ఆయిల్, గ్యాస్2ను వినియోగించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. లేదంటే నాగరికత ఒక కుదుపును ఎదుర్కోక తప్పదని చెప్పారు.

మస్క్ మూడుసార్లు విడాకులు తీసుకున్నాడు. పది మంది పిల్లలకు తండ్రి. అందులో ఒక చిన్నారి పదివారాల వయసులో కన్నుమూసింది. తాను ఓ సింగర్‌తో పాక్షికంగా వేరుపడి ఉన్నానని ఆయన ఇటీవలే వివరించారు.  

న్యూరాలింక్ ఉద్యోగినితో ఆయనకు సంబంధం ఉన్నదని ఇటీవలే అమెరికన్ ప్రెస్ వెల్లడించింది. వీరికి నవంబర్‌లో కవలలు జన్మించినట్టూ పేర్కొంది.

click me!