ఫ్లైట్ గాలిలో ఎగురుతుండగా.. కాక్‌పిట్‌లో పైలట్ల గొడవ.. కాలర్లు పట్టుకుని బాదుకున్నారు

By Mahesh KFirst Published Aug 29, 2022, 4:37 PM IST
Highlights

విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పైలట్లు గొడవ పెట్టుకున్నారు. విమానం నార్మల్‌గా ప్రయాణిస్తుండగానే కాక్‌పిట్‌లో వారి మధ్య వాగ్యుద్ధం ముదిరి కాలర్లు పట్టుకునే దాకా వెళ్లింది. ఒకరు ఏకంగా చేయిచేసుకున్నాడు కూడా. జూన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 

న్యూఢిల్లీ: విమానాన్ని కంట్రోల్ చేసే పైలట్లు ఎంతో శ్రద్ధగా, ఫోకస్డ్‌గా ఉండాల్సి ఉంటుంది. విమానం రన్ వే పై పరుగులు పెట్టింది మొదలు మళ్లీ సేఫ్‌గా ల్యాండ్ అయ్యే వరకు ప్రతీ ఒక్క విషయాన్ని వారే తమ నియంత్రణలో ఉంచుకోవాలి. మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, విమానం గాల్లోకి ఎగిరి నిర్దిష్టమైన ఎత్తుకు చేరుకున్న తర్వాత పైలట్ల మధ్య గొడవ చోటుచేసుకుందని, వాగ్వాదం నుంచి ముష్టి యుద్ధం దాకా ఈ వివాదం వెళ్లింది. జూన్‌లో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ పైలట్లు ఈ విధంగా ప్రవర్తించారు. జూన్ నెలలో ఎయిర్ ఫ్రాన్స్ విమానం జెనీవా నుంచి ప్యారిస్‌కు బయల్దేరింది. గాల్లోకి ఎగిరింది. నిర్దిష్ట ఎత్తుకు ఆ విమానం చేరుకున్న తర్వాత ఫ్లైట్ కాక్‌పిట్‌లో ఉన్న పైలట్, కో పైలట్ మధ్య వివాదం రాజుకుంది. ఆ వివాదం తొలుత వాగ్యుద్ధంగా మొదలైంది. ఒకరిని మరొకరు దుర్భాషలాడుకున్నారు. ఆ తర్వాత వివాదం తీవ్రతరమైంది. లేచి ఒకరి కాలర్‌ను మరొకరు పట్టుకున్నారు. అందులో ఒకరు మరొకరి చెంప చెల్లుమనిపించినట్టు తెలిసింది.

జూన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఇద్దరు పైలట్ల మధ్య గొడవ జరిగిన తర్వాత కూడా ఫ్లైట్ నార్మల్‌గానే ల్యాండ్ అయింది. సాధారణంగా పైలట్లు దిగి వెళ్లిపోయారు. అసలు కాక్‌పిట్‌లో ఏ రగడా జరిగినట్టు బయటకు రాలేదు. అందుకే ఈ విషయం ఆ విమాన సంస్థకు కూడా అప్పుడే తెలియలేదు. తాజాగా, ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ ప్రతినిధి శనివారం ధ్రువీకరించారు.

ఈ విషయం యాజమాన్యానికి తెలియగానే పైలట్లను డిస్మిస్ చేసింది. ప్రస్తుతం ఆ పైలట్లు యాజమాన్యం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

click me!