
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్(Ukraine)పై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆగ్రహించిన చాలా దేశాలు ఆ దేశంపై ఆంక్షల విధింపును పెంచుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. మరిన్ని ఆంక్షల దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాక్ (World Bank) ఉక్రెయిన్ పై దాడినికి కొనసాగిస్తున్న రష్యాతో పాటు.. దానికి సహకారం అందిస్తున్న బెలారస్ కు షాక్ ఇచ్చింది.
ఉక్రెయిన్ పై సైనిక చర్యలను కొనసాగిస్తున్న రష్యా తీరుపై ప్రపంచ బ్యాక్ (World Bank) ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, ఉక్రెయిన్ పై దాడులకు సహకరిస్తున్న బెలారస్ తీరును ఖండిస్తూ.. రష్యా, బెలారస్‌లలో తమ కార్యక్రమాలన్నింటినీ తక్షణమే (immediate effectస) నిలిపివేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఉక్రెయిన్ లోని డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను రష్యా స్వతంత్రంగా గుర్తించిన మూడు రోజుల తర్వాత ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై మిలిటరీ చర్యను ప్రారంభించింది. తాము పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని మొదట్లో పేర్కొన్న రష్యా.. ఆ తర్వాత దూకుడు పెంచుతూ.. ఉక్రెయిన్ లోని నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా మొదలు పెట్టిన ఈ దాడి కారణంగా రెండు దేశాలకు భారీ నష్టం జరిగిందనీ, వేల మంది చనిపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ప్రపంచంలోని చాలా దేశాలు ఉక్రెయిన్ (Ukraine) పై కొనసాగిస్తున్న ఈ దాడులను వెంటనే ఆపాలని రష్యాకు సూచించాయి. వీటిని పట్టించుకోకుండా దాడులు పెంచిన నేపథ్యంలో రష్యాను హెచ్చరిస్తూ.. ఆ దేశంపై ఆంక్షలు విధింపునకు దిగాయి. పెద్ద సంఖ్యలో దేశాలు, సంస్థలు.. వ్యాపార సంబంధాలను తెంచుకోవడం మొదలు పెడుతూ.. ఆంక్షలతో రష్యాపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు బెలారస్, రష్యాలలో తమ కార్యక్రమాలు తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ 2014 నుండి రష్యాకు కొత్త రుణాలు లేదా పెట్టుబడులను ఆమోదించలేదు. 2020 మధ్యకాలం నుండి బెలారస్‌కు కొత్త రుణాలు ఆమోదించబడలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 189 సభ్య దేశాలతో కూడింది ఈ బ్యాంకింగ్ సంస్థ (World Bank). రష్యా దాడి చేసిన తర్వాత, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ దాడిని ఖండించారు, "ఉక్రెయిన్‌లో జరిగిన సంఘటనల ఫలితంగా దిగ్భ్రాంతికరమైన హింస మరియు ప్రాణనష్టం కారణంగా సమూహం భయపడింది" అని చెప్పారు. మేము ఉక్రెయిన్ దీర్ఘకాల భాగస్వామి.. ఈ క్లిష్టమైన సమయంలో దాని ప్రజలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. పలు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు సైతం ఇప్పటికే రష్యా పై ఆంక్షలు విధించాయి.