
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడులు కొనసాగిస్తుంది. పలు ప్రాంతాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టిస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలను రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే రష్యా బలగాలకు కొన్నిచోట్ల ఉక్రెయిన్ ధీటుగా సమాధానం ఇస్తుంది. ఈ యుద్దం వల్ల ఉక్రెయిన్‌తో పాటు రష్యా వైపు కూడా భారీగానే నష్టం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.
తాజాగా రష్యాకు ఉక్రెయిన్ సైనికులు భారీ షాక్ ఇచ్చారు. అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన రష్యా యుద్ద విమానాన్ని ఉక్రెయిన్ వాయుసేన కూల్చివేసింది. సుఖోయ్ su-29 యుద్ద విమానాన్ని మిగ్-29 యుద్ద విమానంతో కూల్చివేశాయి ఉక్రెయిన్ బలగాలు. R-73 మిసైల్‌ను ప్రయోగించి కుప్పకూల్చింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
‘మేము ఇప్పుడే ఇర్పిన్ మీదుగా వెళ్తున్న రష్యన్ SU-30 యుద్ధ విమానాన్ని కూల్చివేసాము. ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ యొక్క పోరాట సిబ్బంది కచ్చితత్వంతో ఈ పనిని పూర్తి చేశారు’ అని ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వాలెరి జలుజ్నీ చెప్పారు.
ఇక, ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగిన అవి సఫలం కాలేదు. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది.