10 కిలోమీటర్ల లోతు రంధ్రం తవ్వుతున్న చైనా.. ఇంతకీ ఏం చేయబోతున్నారంటే?

By Rajesh KarampooriFirst Published Jun 1, 2023, 6:11 AM IST
Highlights

డ్రాగన్ కంట్రీ చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భూమి లోపలికి ఏకంగా 10 కిలోమీటర్ల లోతుగా బోర్‌వెల్‌ తవ్వుతున్నది. భూమి లోపలి పరిస్థితులపై పరిశోధనలకు గానూ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది. దీనిని వాయవ్య చైనాలోని జింజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఈ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి

డ్రాగన్ కంట్రీ చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భూమి లోపల 10 కిలోమీటర్లు (10000 మీటర్లు) లోతున రంధ్రం చేస్తున్నారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ దేశం భూమి లోపలి పరిస్థితులపై పరిశోధనలకు గానూ ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలుస్తున్నది. భూమి ఉపరితలం పైన, దిగువన ఉన్న కొత్త సరిహద్దులను అన్వేషించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు.

చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రకారం.. లోతైన బోర్‌వెల్ డ్రిల్లింగ్ పనులు దేశంలోని చమురు సంపన్న ప్రావిన్స్ జిన్‌జియాంగ్‌లో ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఉదయం చైనా తన మొదటి వ్యోమగామిని గోబీ ఎడారి నుండి అంతరిక్షంలోకి పంపింది. భూమిపై అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రం ఇప్పటికీ రష్యన్ కోలా సూపర్‌డీప్ బోర్‌హోల్. దీనిని 1989లో చేశారు. ఈ రంధ్రం లోతు 12,262 మీటర్లు (40,230 అడుగులు)  ఉంటుంది. 

మీడియా నివేదిక ప్రకారం.. భూమి లోపలి 10 రాతి పొరలను చీల్చుకొని భూమి యొక్క క్రస్ట్‌లోని క్రెటేషియస్ వ్యవస్థకు చేరుకుంటుంది. భూమి క్రస్ట్‌లో కనుగొనబడిన శిల వయస్సు 145 మిలియన్ సంవత్సరాలుగా చెప్పబడింది. చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని శాస్త్రవేత్త సన్ జిన్‌షెంగ్ మాట్లాడుతూ..డ్రిల్లింగ్ ప్రాజెక్ట్‌లోని ఇబ్బందులను రెండు సన్నని ఉక్కు కేబుల్‌లపై నడుస్తున్న పెద్ద ట్రక్కుతో పోల్చవచ్చని చెప్పారు.

భూమి పుట్టుక, కాలక్రమంలో వచ్చిన మార్పులు, జీవ పరిణామాన్ని, గతంలో సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చెబుతున్నారు. 2021లో అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భూమి యొక్క లోతుల్లో అన్వేషణకు పిలుపునిచ్చారు. ఇటువంటి పని ఖనిజ , శక్తి వనరుల అన్వేషణలో సహాయపడుతుంది. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి పర్యావరణ విపత్తుల ప్రమాదాలను అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది.

click me!