హైడ్రాక్సీ క్లోరోక్విన్ వద్దు.. డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ ప్రకటన

By telugu news teamFirst Published May 26, 2020, 7:55 AM IST
Highlights

క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కరోనా రోగులకు మలేరియాకి మందుగా వాడే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వడాన్ని కొంత కాలం ఆపాల్సిందిగా ప్రకటన చేసింది. కోవిడ్-19 రోగులకు ఈ ఔషధం ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది మరణిస్తున్నారంటూ ఇటీవల లాన్సెట్ లో ఓ అధ్యయనం వెలువడింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కి ఇప్పటి వరకు మందు లేదు. ఈ నేపథ్యంలో దాని నివారణకు ప్రపంచ దేశాల్లోని నిపుణులు, పరిశోధకులు కృషి చేస్తున్నారు. కరోనాను తగ్గించేందుకు మందు కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కరోనా సోకిన వారికి వైద్యం అందిస్తున్న సమయంలో వారికి మలేరియా రోగులకు ఇచ్చే మందు ఇప్పుడు వాడుతున్నారు. 

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు కరోనా వైరస్ బాధితులకు తక్షణ చికిత్సకు అందిస్తున్నారు. అందుకే ఇటీవల అమెరికాతో పాటు పలు దేశాలు భారతదేశ సహాయం కోరాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు భారతదేశం లో అధికంగా ఉండడంతో ఆ దేశాలు భారత్కు విజ్ఞప్తులు చేస్తున్నాయి. అయితే హైడ్రాక్సి క్లోరొక్విన్ మందు కరోనా వైరస్కు మందు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించలేదు. అయినప్పటికీ ఈ ఔషధాన్నే వినియోగిస్తున్నారు.

కాగా.. తాజాగా దీనిపై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కరోనా రోగులకు మలేరియాకి మందుగా వాడే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వడాన్ని కొంత కాలం ఆపాల్సిందిగా ప్రకటన చేసింది. కోవిడ్-19 రోగులకు ఈ ఔషధం ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది మరణిస్తున్నారంటూ ఇటీవల లాన్సెట్ లో ఓ అధ్యయనం వెలువడింది. ఈ క్రమంలో కొంతకాలం పాటు క్లినికల్ ట్రయల్స్ లో  ఈ మందు ఇవ్వడం ఆపాలంటూ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వర్చువల్ విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాలిడారిటీ ట్రయల్స్ పేరిట చాలా దేశాలు.. కరోనాకి మందు కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్నాయని ఆయన అన్నారు. కరోనా రోగులపై పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ పరీక్షల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకాన్ని మాత్రం నిలిపివేయాలని  చెప్పారు. కేవలం ఈ మందుపై మాత్రమే తాత్కాలిక నిషేధం విధించామని.. ఇతర క్లినికల్ ట్రయల్స్ యాథావిధిగా కొనసాగించవచ్చని చెప్పారు.

హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా ఆర్థరైటిస్‌కు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు, కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఈ మందు వాడుతున్నామంటూ బహిరంగా ప్రకటించారు.  తాను కూడా స్వయంగా ఆ మందులు మింగుతున్నానంటూ ట్రంప్ ప్రకటన తర్వాత వాటి వినియోగం మరింత పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

 బ్రెజిల్ ఆరోగ్య మంత్రి కూడా గత వారం హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు మలేరియా వ్యతిరేక క్లోరోక్విన్ ని కరోనా రోగులకు ఉపయోగించాలని సిఫారసు చేశారు.

రెండు మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను, ముఖ్యంగా గుండె అరిథ్మియాను ఉత్పత్తి చేస్తాయని లాన్సెట్ అధ్యయనం కనుగొంది. దీంతో.. దీనిపై డబ్ల్యూహెచ్ఓ తాత్కాలిక నిషేధం విధించింది.


 

click me!