97 మందిని పొట్టనబెట్టుకున్న విషాదం: కరాచీ విమానం కూలడానికి ముందు..జరిగింది ఇదీ

By Siva KodatiFirst Published May 24, 2020, 5:10 PM IST
Highlights

పాక్ ఆర్దిక రాజధాని కరాచీలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంతటి విషాదానికి దారి తీసిన పరిస్ధితులపై పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది

పాక్ ఆర్దిక రాజధాని కరాచీలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంతటి విషాదానికి దారి తీసిన పరిస్ధితులపై పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది.

ఈ ప్రమాదంలో బతికి బయటపడ్డ మొహమ్మద్ జుబేర్ అనే ప్రయాణికుడు ఘటన జరగడానికి ఏం జరిగిందో దర్యాప్తు అధికారులకు వివరించాడు. లాహోర్‌లో బయల్దేరిన విమానం కరాచీ వరకు బాగానే  వచ్చిందని, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని మొహమ్మద్ పేర్కొన్నాడు.

పీఐఏకు చెందిన 8303 విమానం లాహోర్ నుంచి సాఫీగానే వచ్చిందని జుబేర్.. తన సీటు 8 ఎఫ్ అని తెలిపాడు. కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్  ఎయిర్‌పోర్టు వద్దకు రాగానే.. పైలట్ అందరినీ సీటు బెల్టు పెట్టుకోవాలని కోరాడు.

Also Read:పాకిస్తాన్‌లో జనావాసాల మధ్య కుప్పకూలిన విమానం: 90 మంది దుర్మరణం..?

సరిగ్గా ల్యాండయ్యే సమయానికి విమానం మూడు  సార్లు  కుదుపులకు గురైందని, అలాగే రన్‌వేను సమీపించిందని మొహమ్మద్ జుబేర్ పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి పైలట్ విమానాన్ని అమాంతం గాల్లోకి పైకి లేపాడని చెప్పాడు.

10, 15 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టాక.. మళ్లీ ల్యాండ్ చేస్తున్నట్లు ప్రకటించాడని తెలిపాడు. ఆయన అలా చెబుతుండగానే తాను కిందకు చూశానని, అప్పుడు మాలిర్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నామని అర్ధమైందని జుబేర్ చెప్పాడు.

ఈలోపే విమానం జనావాసాల మధ్య కుప్పకూలిపోయిందని.. తాను స్పృహ కోల్పోయి కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పొగ వ్యాపించి వుందని మొహమ్మద్ ఈ ఘటన జరిగిన విధానాన్ని వివరించాడు.

ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణించగా ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అందులో జుబేర్ ఒకరు కాగా, మరో వ్యక్తి బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సీఈవో జఫర్ మసూద్. 

click me!