కరోనా కొత్త వేరియంట్ కలకలం.. దక్షిణాప్రికా ప్రయాణాలపై యూరప్ బ్యాన్.. డబ్ల్యూహెచ్‌వో భేటీ

By telugu team  |  First Published Nov 26, 2021, 3:15 PM IST

దక్షణిఫ్రికాలో వెలుగుచూసిన బీ.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. ఈ వేరియంట్ ఎన్నో దేశాలను మళ్లీ సంక్షోభంలోకి నెట్టే ముప్పు ఉన్నదని, టీకా వేసుకున్నా దాని అధిగమించే శక్తి ఈ వేరియంట్‌కు ఉన్నదని అధికారవర్గాల నుంచి అభిప్రాయలు వస్తున్నాయి. దీంతో యూకే, ఇటలీ, జర్మనీ దేశాల దక్షిణాఫ్రికా దేశం నుంచి ప్రయాణాలపై నిషేధం విధించాయి. త్వరలోనే యూరోపియన్ యూనియన్ కూడా దీనిపై ప్రతిపాదన చేయనున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు నేడు ఈ వేరియంట్‌పై భేటీ కానుంది.


న్యూఢిల్లీ: కరోనా కేసులు(Corona Cases) తగ్గుముఖం పడుతున్నాయని, టీకా పంపిణీ(Vaccination) విజయవంతమవుతున్నదనే ఆశలు చిగురుస్తుండగానే మరో భయానక వార్త వచ్చింది. అంతా సవ్యంగానే ఉన్నదనుకునే పరిస్థితుల్లోనే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతున్నది. ఈ వేరియంట్‌పై అనేక భయాందోళనలు నెలకొనడంతో ఐరోపా దేశాలు అలర్ట్ అయ్యాయి. ఆ దక్షిణాఫ్రికా దేశాల నుంచి ప్రయాణాలపై నిషేధం(Travel Ban) విధిస్తున్నాయి. ఇప్పటికే యూకే, జర్మనీ, ఇటలీ దేశాలు ఈ నిర్ణయం తీసుకోగా త్వరలోనే ఐరోపా సమాఖ్య(EU)నే దీనిపై ఓ ప్రతిపాదన చేయనున్నట్టు తెలిసింది. కాగా, ఈ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రతినిధులు నేడు సమావేశం కానున్నారు. ఈ వేరియంట్ తీరును, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. ఈ వేరియంట్ ప్రమాదకరమా? కాదా? అనే విషయాన్ని చర్చించనున్నారు.

మన దేశంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతుండటంతో ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేసే అవకాశాలున్నట్టు తెలిసింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ కార్యదర్శి కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ, ఇంతలోనే పిడుగు లాంటి వార్త వచ్చింది. దక్షిణాఫ్రికా దేశంలో బీ.1.1.529 వేరియంట్ విజృంభిస్తున్నది. ఈ వేరియంట్ ప్రమాదకరంగా ఉన్నదని, ఎన్నో దేశాలను ఈ వేరియంట్ మళ్లీ సంక్షోభంలోకి నెట్టే ముప్పు ఉన్నదనే అభిప్రాయాల్లో అధికారుల నుంచి వినిపిస్తున్నది. దేశాల ఆరోగ్య వ్యవస్థకు సవాల్ విసరడమే కాదు.. టీకా రక్షణనూ ఇది అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదనే ఆందోళనలూ వచ్చాయి. దీంతో మరోసారి దేశాలు సరిహద్దు మూసుకోవాల్సిందేనా? ఆర్థికానికి మళ్లీ బ్రేక్ వేయాల్సిందేనా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా దేశంలో ఈ వేరియంట్ పంజా విసురుతున్నది. దీంతో ఈ దేశం సహా దాని పొరుగు దేశాల నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించడానికి ఐరోపా సమాఖ్య సిద్ధమవుతున్నది.

Latest Videos

undefined

Also Read: ఆందోళనకరంగా కరోనా కొత్త వేరియంట్... జాగ్రత్త: రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య హెచ్చరిక

ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల నుంచి ప్రయాణాలను పూర్తిగా నిషేధించాలని యూరోపియన్ యూనియన్ భావిస్తున్నది. బీ.1.1.529 వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికా దేశాల నుంచి ప్రయాణాలను అత్యవసరంగా నిలిపేయాలని సభ్య దేశాలను ఆదేశించే ప్రతిపాదనలు చేస్తున్నట్టు ఈయూ చీఫ్ ఉర్సులా వన్ డెర్ లెయెన్ ట్వీట్ చేశారు.

ఐరోపా దేశం జర్మనీ ఇప్పటికే కొత్త ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణాలపై తమ నిబంధనలు అమల్లోకి వస్తాయని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. అక్కడి నుంచి కేవలం జర్మనీ పౌరులకు మాత్రమే దేశంలోకి అనుమతి ఉంటుందని వివరంచారు. అయితే, వారు టీకా వేసుకున్నప్పటికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు చేసినట్టు తెలిపారు. జర్మనీ ఇప్పటికీ ఫోర్త్ వేవ్ ముప్పు నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో కొత్త వేరియంట్ మరింత ఆందోళనలు కలుగజేయడంతో వెంటనే ప్రయాణాలపై నిబంధనలను విడుదల చేసింది.

Also Read: సూపర్ స్ప్రెడర్ గా కర్ణాటక మెడికల్ కాలేజ్ పార్టీ... 182 చేరిన కరోనా కేసులు...

కాగా, ఇటలీ ప్రభుత్వం కూడా శుక్రవారమే ప్రయాణాలపై నిషేధాన్ని ప్రకటించింది. దక్షిణాఫ్రికా దేశం సహా లెసోతో, బోట్స్‌వానా, జింబాబ్బే, మొజాంబిక్, నమీబియా, ఎస్వాతినిల్లో గత 15 రోజుల కాలంలో ఉన్నవారిని దేశంలోకి రానివ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. సౌత్ ఆఫ్రికా దేశం సహా దాని చుట్టుపక్కల దేశాల నుంచీ తమ దేశంలోకి ప్రయాణాలను నిషేధిస్తున్నట్టు యూకే ప్రకటించింది. కాగా, ఆ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఏ ప్రకటన చేయకముందే యూకే నిర్ణయాలు చేయడం అభ్యంతరకరమని దక్షిణాఫ్రికా దేశం  ఖండించింది.

click me!