క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆపరేషన్ యూనికార్న్ అమలు.. ఏమిటీ ఈ ఆపరేషన్?

By Mahesh KFirst Published Sep 9, 2022, 2:04 AM IST
Highlights

క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆపరేషన్ యూనికార్న్‌ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే బీబీసీ ప్రెజెంటర్లు నలుపు రంగు దుస్తులు ధరించారు. క్వీన్ మరణం తర్వాత చేపట్టే చర్యలే ఈ ఆపరేషన్‌లో ఉంటాయి. స్కాట్లాండ్‌లో మరణించిన క్వీన్ ఎలిజబెత్ 2 పార్థీవ దేహాన్ని హూలిరూడ్ హౌస్‌లో సందర్శనకు ఉంచుతారు.

న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ గురువారం తన 96వ యేటా స్కాట్లాండ్‌లో మరణించారు. ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె ప్రాణం వదిలారు. ఆమె ప్రశాంతంగా మరణించినట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. బ్రిటన్ ఆమె మరణం కారణంగా సుమారు వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటించవచ్చు.

క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల కోసం బకింగ్ హామ్ ప్యాలెస్ ఇప్పటికే ఆపరేషన్ లండన్ బ్రిడ్జీ కోడ్ నేమ్‌ను సిద్ధంగా ఉంచుకున్నది. కానీ, ఆమె లండన్‌లో కాకుండా స్కాట్లాండ్‌లో మరణించారు. దీంతో కోడ్ నేమ్ మారినట్టు తెలిసింది. ఆపరేషన్ లండన్ బ్రిడ్జీ కాకుండా.. ఆపరేషన్ యూనికార్న్‌ను అమల్లోకి తెస్తున్నారు.

స్కాట్లాండర్ జాతీయ జంతువు పేరును ఈ కోడ్ నేమ్‌గా బకింగ్ హామ్ ప్యాలెస్ తీసుకుంది. మోనార్క్ ఎలిజబెత్ 2 స్కాట్లాండ్‌లో మరణిస్తే.. ఈ పేరును తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే పలు నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బీబీసీ యాంకర్లు ఇప్పటికే నలుపు రంగు దుస్తుల్లో ప్రెజెంట్ చేస్తున్నారు. చానెళ్లు కూడా రోలింగ్ న్యూస్‌కు మారాయి. 

యూకే జాతీయ గీతంలో మార్పు రానుంది. బ్రిటీష్ సింహాసనానికి సంబంధించిన లైన్ చేరనుంది. యూకే కరెన్సీ నోట్లు, కాయిన్లు మొత్తం క్వీన్ ఎలిజబెత్ 2 బొమ్మ నుంచి కొత్త రాజు చార్లెస్ బొమ్మగా మారుతాయి. ఇది కొన్నేళ్లుగా సాగే ప్రక్రియ. డౌనింగ్ స్ట్రీట్‌లో ఇప్పటికే జాతీయ జెండాను సగానికి అవనతం చేశారు. సంతాపం తెలుపుతూ పార్లమెంటు తీర్మానం చేస్తుంది. అధికారిక లాంఛనాలతో క్వీన్ అంత్యక్రియలకు చర్యలు మొదలవుతాయి.

స్కాట్లాండ్‌లో రాణి మరణించడం మూలంగా చాలా మంది అక్కడికి చేరే అవకాశం ఉంటుందని యూకే నేతలు భావిస్తున్నారు. ఆపరేషన్ యూనికార్న్‌కు సంబంధించి కీలక వివరాలు ది హెరాల్డ్ పత్రికకు అందాయి. క్వీన్ ఎలిజబెత్ 2 స్కాట్లాండ్‌లో మరణిస్తే ఆమె పార్థీవ దేహాన్ని హూలిరూడ్ హౌస్‌లో సందర్శనకు ఉంచుతారు. ఆ తర్వాత ఆమె పార్థీవ దేహాన్ని కఫిన్‌లో రాయల్ మైల్ (ఎడిన్ బర్గ్‌) గుండా క్యాథడ్రాల్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆమె పార్థీవ దేహాన్ని ఎడిన్ బర్గ్‌లోని వేవెర్లీ స్టేషన్‌లో రాయల్ ట్రైన్‌లో ఉంచుతారు. అక్కడి నుంచి ఆమె పార్థీవ దేహం ఈస్ట్ కోస్ట్ లైన్‌కు కలుస్తుంది. అక్కడి నుంచి లండన్‌కు చేరుతుందని ఈ ఆపరేషన్ యూనికార్న్ గురించి అవగాహన ఉన్నవారు తెలిపారు.

click me!