
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukarine)పై రష్యా(Rissoa) సైనిక చర్యతో(Military Operations) ప్రపంచ దేశాలన్నీ గందరగోళంలో మునిగిపోయాయి. ఆ దేశంలో చిక్కుకున్న పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా, రష్యా, ఉక్రెయిన్‌లు శాంతి చర్చలు జరపడానికి ఎట్టకేలకు అంగీకరించాయి. అయితే, ఈ శాంతి చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ దేశాన్ని వెంటనే ఐరోపా సమాఖ్యలో కలుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌ను ప్రత్యేక పద్ధతి చేర్చుకోవాలని యూరోపియన్ యూనియన్‌ను ఆయన కోరారు. యూరోపియన్‌లు అందరితో తాము కలిసి ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా అందరితో సమానంగా.. అభివృద్ధిలోనూ సమానంగా దూసుకుపోవాలని అనుకుంటున్నామని వివరించారు. ఇది చాలా మంచి విషయమేనని నాకు తెలుసు.. అంతేకాదు, ఇది కచ్చితంగా సాధ్యమయ్యే విషయమేనని పేర్కొన్నారు.
రష్యా దాడులతో ప్రపంచానికి ఉక్రెయిన్‌లు అంటే ఎలాంటి వారో తెలిసి వచ్చిందని, అదే విధంగా రష్యా ఎంతగా మారిపోయిందో కూడా చాలా మంది అర్థం అయిందని జెలెన్‌స్కీ వివరించారు. శాంతి చర్చలకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఓ వీడియో మెస్సేజీని విడుదల చేశారు. అందులో ఈ కీలక విషయాలను ప్రస్తావించారు. వీటికతోడు ఇప్పటి వరకు రష్యాకు చెందిన కనీసం 4,500 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అదే విధంగా రష్యా సైనికులకూ ఆయన కొన్ని సూచనలు చేశారు. రష్యా సైనికులారా.. ఎక్కడి వారు అక్కడి నుంచే ఆయుధాలు పడేసి వెనక్కి వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకోవాలని అన్నారు. పై అధికారులను, దుష్ప్రచారం చేసేవాళ్లనూ ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని, కానీ, కనీసం మీరు మీ ప్రాణాలు కాపాడుకోండని పేర్కొనడం చర్చనీయాంశం అయింది.
తామంతా పోరాట యోధులం అని అన్నారు. రష్యా సైన్యానికి జెలెన్ స్కీ వార్నింగ్ ఇచ్చారు. రష్యా సైనికులు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే తమ దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించారు. రష్యా వ్యతిరేక పోరాటంలో పాల్గొనేందుకు సైనిక అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేస్తామని చెప్పారు. తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 4,500 మంది రష్యన్ సైనికులు మరణించారని జెలెన్ స్కీ చెప్పారు. ఇక, ఐదు రోజులలో ఇప్పటివరకు రష్యా దాడిలో 14 మంది పిల్లలతో సహా 352 మంది పౌరులు మరణించారని ఉక్రేనియన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 116 మంది పిల్లలతో సహా 1,684 మంది గాయపడ్డారని తెలిపింది.
అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఉక్రెయిన్‌ను రష్యా చర్చలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు యుద్దం చేస్తూనే.. మరోవైపు చర్చలకు సిద్దమని తెలిపింది. అయితే బెలారస్ వేదికగా చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తొలుత అంగీకరించలేదు. ఆ తర్వాత మనసు మార్చుకున్న జెలెన్ స్కీ చర్చలు జరిపేందుకు సిద్దమయ్యారు. ఉక్రేయిన్- బెలారస్ సరిహద్దులోని Prypiat నది సమీపంలో చర్చలు జరిపేందుకు అంగీకరించారు. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.