
జూన్ లో రష్యా సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించిన వాగ్నర్ కిరాయి దళం అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించాడు. వాగ్నర్ చీఫ్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో ఆయనతో తో పాటు అందులో ఉన్న మరో తొమ్మిది మంది చనిపోయారని రష్యా అధికారులు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి ఆయనకు సవాలుగా భావించే స్వల్పకాలిక తిరుగుబాటును యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రారంభించిన రెండు నెలల తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
ఈ తిరుగుబాటు మొదలై, ముగిసిపోయిన నాటి నుంచి అప్పటి నుండి వాగ్నర్, దాని వివాదాస్పద చీఫ్ భవితవ్యం చుట్టూ అనిశ్చితి చుట్టుముట్టింది. కాగా.. మాస్కో- సెయింట్ పీటర్స్ బర్గ్ మధ్య ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు విమానం కూలిపోయినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది సహా మొత్తం 10 మంది మృతి చెందినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే ఈ విమానంలో వాగ్నర్ చీఫ్ ఉన్నారని రష్యా ఏవియేషన్ ఏజెన్సీ తెలిపింది. ఎంబ్రేయర్-135 (ఈబీఎం-135బీజే) విమానంలో ప్రిగోజిన్ యెవ్జెనీ ఉన్నారని ఆ ఎయిర్ లైన్స్ పేర్కొంది. కాగా.. వాగ్నర్త్ సంబంధం ఉన్న టెలిగ్రామ్ ఛానళ్లు - ఏఎఫ్ పీ ధృవీకరించలేని దృశ్యాలను పోస్ట్ చేశాయి. అందులో ఓ మైదానంలో కాలిపోతున్న విమాన శకలాలు కనిపించాయి.
ఇదిలా ఉండగా ఎంఎన్టీ-ఏరోకు చెందిన విమానం కూలిపోవడంపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసినట్లు రోసావియాట్సియా తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు తీవ్రమైన నేరాలపై దర్యాప్తు చేసే రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. ప్రమాద స్థలంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయని అత్యవసర సేవలు తెలిపినట్టు ఆర్ఐఏ నోవోస్టి పేర్కొంది.
ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికలపై కైవ్, వాషింగ్టన్ వేగంగా స్పందించాయి. అయితే అసలేం జరిగిందో తనకు తెలియదని, కానీ ఈ ఘటనపై తాను ఆశ్చర్యపోలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కాగా.. 2024 ఎన్నికలకు ముందు పుతిన్ రష్యా ఉన్నత వర్గాలకు ఇచ్చిన సంకేతమే ఈ విమాన ప్రమాదం అని ఉక్రెయిన్ అధ్యక్ష సహాయకుడు మైఖైలో పొడోల్యాక్ సోషల్ మీడియాలో ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 24, 2022 న ఉక్రెయిన్ లో రష్యా దాడి సమయంలో.. గతంలో నీడలో పనిచేసిన ప్రిగోజిన్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.