
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం 11వ రోజుకు చేరింది. ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉక్రెయిన్‌లో రష్యా దాడి చేస్తుంది. ఖేర్సన్‌ను ఆక్రమించిన రష్యా బలగాలు.. సముద్ర తీర ప్రాంతాలైన మరియుపోల్, వోల్నోవాఖ నగరాలను చుట్టుముట్టాయి. కీవ్‌పై రష్యా దళాలు బాంబు దాడులను కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోవాలని రష్యా తీవ్రంగా యత్నిస్తున్నాయి. అయితే, ఉక్రేనియన్ బలగాలు కూడా చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.
ఈ క్రమంలో.. ఎటు చూసినా.. బాంబు పేలుళ్లు, మిసెల్స్ దాడులు.. సైరన్ మోతలు.. దీంతో ఉక్రెయిన్ నగరాలు.. శ్మశానాల్లా మారాయి. ఎక్కడ చూసినా.. శవాలు.. రక్తం ఏరులై పారుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. రష్యా దాడుల్లో ఆ దేశ ప్రజలే కాదు.. అక్కడ నివాసం ఉంటున్న ఇతర దేశాల ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే యుద్దం తక్షణమే నిలివేయాలని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆధునిక యుగంలో ఇలాంటి యుద్దాలు చేయడం సరికాదనీ, శాంతి చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ను హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రతిఘటనను నిలిపివేసి.. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చినట్లయితే మాత్రమే.. రష్యా సైనిక ఆపరేషన్ నిలిపివేయబడుతుందని, లేనిచో.. యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్‌ను పుతిన్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మూడవ రౌండ్ శాంతి చర్చల్లో ‘నిర్మాణాత్మక’ విధానాన్ని చేపట్టాలని, అదే మంచిదని ఉక్రెయిన్‌కు సూచించారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌తో ఆదివారం ఫోన్‌లో మాట్లాడిన పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో రష్యా “ప్రత్యేక ఆపరేషన్” ప్రణాళిక ప్రకారం, షెడ్యూల్ ప్రకారం జరుగుతోందని చెప్పారు. అనుకున్నట్లుగానే తమ లక్ష్యాలను చేరుకుంటున్నామని చెప్పారు.
మరోవైపు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సుమారు గంటా 45 నిమిషాలపాటు రష్యా అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ తీరుపై రష్యా అధ్యక్షుడు మండిపడ్డారు. రష్యా దళాలు చుట్టుముట్టిన పోర్టు నగరమైన మరియుపోల్‌లో కాల్పులు విరమించినప్పటికీ పౌరులను తరలించడంలో ఉక్రెయిన్ విఫలమైందని విమర్శించారు. విదేశీలను బంధీలుగా చేసుకునేందుకు ఉద్దేశ పూర్వకంగానే ఉక్రెయిన్ ఇలా వ్యవహరించిందని పుతిన్ ఆరోపించారు.
రష్యా ఫిబ్రవరి 24న ప్రారంభించిన యుద్దాన్ని "ప్రత్యేక సైనిక చర్య" అని పిలుస్తుంది. రష్యాకు ఉక్రెయిన్‌ను ఆక్రమించే ఆలోచన లేదని పేర్కొంది, ఉక్రెయిన్ ఒకప్పుడు మాస్కో అధికారంలో ఉన్న సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉంది, అయితే ఇది ఇప్పుడు నాటో మరియు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోరుతూ పశ్చిమం వైపు తిరిగింది. నో-ఫ్లై జోన్‌పై యుద్ధ ప్రకటన ఉంటుందని పుతిన్ హెచ్చరించడంతో రష్యా కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఉక్రెయిన్ పేర్కొంది.
మరో దక్షిణాది నగరమైన ఒడెస్సాపై బాంబుదాడి చేసేందుకు రష్యా కూడా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. "వారు మమ్మల్ని నాశనం చేస్తున్నారు" అని మారియుపోల్ మేయర్ వాడిమ్ బాయ్చెంకో నగర దుస్థితిని వివరిస్తూ చెప్పారు. రాజధాని కైవ్‌లో ఉక్రేనియన్ సైనికులు కందకాలు త్రవ్వడం, రోడ్లను అడ్డుకోవడం, సమీపంలోని ప్రాంతాలపై బాంబు దాడి చేయడంతో పౌర రక్షణ విభాగాలతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా రక్షణ చర్యలు చేపట్టారు.