
ఈ ఏడాది జూన్‌లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికులు మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అనధికారికంగా చైనా వైపు కూడా 45 మంది వరకు చనిపోయినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
కానీ దీనిపై చైనా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే కరోనా విషయంలో సీఎన్‌ఎన్ ప్రచురించిన ‘వుహాన్ ఫైల్స్’ చైనా గుట్టు రట్టు చేయగా.. తాజాగా గల్వాన్ దాడికి సంబంధించిన వాస్తవాలను అమెరికా అత్యున్నత స్థాయి కమిషన్ వెల్లడించింది.
యునైటెడ్ స్టేట్స్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ (యూఎస్‌సీసీ) వార్షిక నివేదిక ప్రకారం చైనా పథకం ప్రకారమే ఈ దాడికి దిగిందని.. భారత్‌కు ప్రాణ నష్టం కలిగించడమే దాని ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధారాలు లభించాయని యూఎస్‌సీసీ నివేదిక వెల్లడించింది.
యూఎస్‌సీసీ 2000 సంవత్సరంలో ప్రారంభమయ్యింది. ఇది అమెరికా-చైనా మధ్య జాతీయ భద్రత, వ్యాణిజ్య సమస్యలను పరిశీలిస్తుంది. బీజింగ్‌పై అమెరికా కాంగ్రెస్ తీసుకోవాల్సిన పరిపాలన, శాసనపరమైన చర్యలను సిఫారసు చేస్తుంది.
అయితే గల్వాన్ ఘర్షణకు ప్రధాన కారణం భారతదేశం సరిహద్దులో వ్యూహాత్మకంగా వ్యవహరించడం.. దళాలకు మద్దతు ఇచ్చే చర్యలను పెంచుకోవడమే అని యూఎస్‌సీసీ నివేదిక తేటతెల్లం చేసింది.