కరోనా వైరస్ అమెరికాలో విలయ తాండవం చేస్తోంది. ప్రతి 24గంటలకు 2వేలకు మించి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ కరోనాతో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకోలేదు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2,569 మంది అంటే దాదాపు 2,600మంది మృత్యువాత పడ్డారు.
జాన్స్‌హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రకారం అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత ఇప్పటి వరకు ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో.. ఇప్పటి వరకు అమెరికాలో 28,526మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏప్రిల్ తొలివారం వరకూ అత్యధిక కరోనా మరణాలు ఇటలీలో సంభవించగా, దానిని అమెరికా అధిగమించింది. అత్యధికంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు, మరణాలు అమెరికాలోనే సంభవిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 30 వేల మంది వైరస్ బారినపడ్డారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 644,089కి చేరింది.
అమెరికాలోని మొత్తం కరోనా మరణాల్లో 11 వేలకుపైగా ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. మూడు అగ్రదేశాలను కలుపుకొని ఎన్ని కేసులు బయటపడ్డాయో అన్ని కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
దేశంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై తాను చేసిన ప్రకటన గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా అది రాష్ట్రాల గవర్నర్లు చూసుకొంటారని తెలిపారు. నిన్నామొన్నటి దాకా న్యూయార్క్‌లో కరోనా మరణాలు 6,589. అలాంటిది అనతికాలంలోనే మృతుల సంఖ్య పది వేలు దాటిపోయింది.
ఒకటి, రెండు రోజుల్లోనే మరణాల రేటు మరీ ఇంతగా పెరిగిందా... ఎలా? న్యూయార్క్ సిటీ హెల్త్ డిపార్టుమెంటు గణాంకాల్లో చేసిన సవరణలే దీనికి కారణం. సాధారణంగా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన కేసుల్లో మరణాలు సంభవిస్తేనే ఈ విభాగం కరోనా మృతులుగా లెక్కిస్తూ వచ్చింది.
అయితే, పాజిటివ్ అని తేలకపోయినా, కొవిడ్-19 కారణంగానే చనిపోయి ఉంటారని భావించినవారినీ తాజాగా ఈ విభాగం మృతుల గణాంకాల్లో చేర్చింది. దీనివల్లే న్యూయార్క్‌లో మరణాల రేటు ఒక్కసారిగా ఎగబాకింది. కాగా, మేలో లాక్‌డౌన్ ఎత్తేసే యోచనలో ట్రంప్ యంత్రాంగం ఉన్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సైన్యం కూడా సిద్ధమవుతోంది.