పాక్‌కు మరో షాక్: కాశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వానికి ట్రంప్ గుడ్‌బై

By Siva KodatiFirst Published Aug 13, 2019, 12:35 PM IST
Highlights

జమ్మూకాశ్మీర్‌ అంశంపై భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. ఇకపై కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది

జమ్మూకాశ్మీర్‌ అంశంపై భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. ఇకపై కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

మధ్యవర్తిత్వం కోసం తాను చేసిన ప్రతిపాదన భారత్, పాకిస్తాన్‌ల అంగీకారంపై ఆధారపడివుంటుందని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు. రెండు దేశాలు ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుందన్నారు.

అయితే ఇందుకు ఇండియా నిరాకరించడంతో ఈ ప్రతిపాదన ఇకపై చర్చకు రాదని ట్రంప్ స్పష్టం చేసినట్లు అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగ్లా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

కొద్దిరోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో జూలై 22న ట్రంప్ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం చేయాలని భారత ప్రధాని నరేంద్రమోడీ తనను కోరినట్లు ట్రంప్ చెప్పడంతో.. మనదేశంలో వివాదం రేగింది.

దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం.. ట్రంప్ వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. మోడీ, ట్రంప్ మధ్య కాశ్మీర్ ప్రస్తావనే రాలేదని తేల్చి చెప్పింది.     ఆ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్య భారత్, పాక్ ద్వైపాక్షిక అంశమేనన్నారు.

ఒకవేళ సాయం కోరితే మధ్యవర్తిత్వం చేస్తానన్నారు. దీనికి భారత్ బదులిస్తూ.. కాశ్మీర్‌పై ఎలాంటి చర్చలైనా అవి కేవలం పాకిస్తాన్‌తో మాత్రమేనని, అది కూడా ద్వైపాక్షికంగానేనని స్పష్టం చేసింది.

దీంతో ఇక ట్రంప్ సైతం పూర్తిగా వెనక్కి తగ్గారు. దీని తర్వాత జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దీనిపై అమెరికా స్పందిస్తూ.. అది పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నుంచి ఆ వ్యాఖ్యలు సహించలేని పాకిస్తాన్‌కు అవి శరఘాతంలా తాగిలాయి. రష్యా సైతం భారత్‌కు మద్ధతు ప్రకటించడంతో దాయాది దేశం దిక్కు తోచని స్ధితిలో పడిపోయింది. 

ఆర్టికల్ 370 రద్దు: ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, పాక్ విదేశాంగ మంత్రి ఆక్రోశం

click me!