
USA: నిద్రిస్తున్న సమయంలో మహిళల ఇంట్లోకి చొరబడి వారి పాదాలను నిమరే అలవాటుకు బానిసైన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా తమ ప్రాంతంలోని పవులురి ఇండ్లల్లోకి ప్రవేశించి ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్న వ్యక్తిని పారిపోతున్న సమయంలో పలుమార్లు హెచ్చరించిన ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన మహిళలు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతని వేలిముద్రల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.ఈ ఘటన అమెరికాలోని నెవాడాలో చోటుచేసుకుంది.
సంబంధిత కేసు గురించి పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాలోని నెవాడాలో మహిళల ఇళ్లలోకి చొరబడి నిద్రిస్తున్న సమయంలో వారి కాళ్లు నిమురుతూ.. వికృత చేష్టలకు పాల్పడుతున్నవ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఆంథోనీ గోంజాలెస్ (26) గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు నెవాడాలోని డగ్లస్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. జూలై 1, 3 తేదీల మధ్య రెండు స్టేట్ లైన్ రిసార్ట్ నివాసాల్లోకి తెల్లవారు జామున అన్ లాక్ చేసిన స్క్రీన్ డోర్ల ద్వారా ఆంథోనీ ప్రవేశించాడని షెరీఫ్ డిపార్ట్ మెంట్ ఫేస్ బుక్ లో తెలిపింది. దొంగచాటుగా ఇంట్లోకి వెళ్లిన నిందితుడు.. ఇద్దరు మహిళల మంచాల దగ్గరకు వెళ్లి వారి పాదాలను నిమురుతూ.. వికృత చేష్టలకు పాల్పడ్డాడు.
దీంతో ఒక్కసారిగి ఉలిక్కిపడి లేచిన ఓ మహిళ గట్టిగా అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రాంతంలోని చాలా మంది మహిళలు ఇలాంటి ఘటనలను ఇది వరకు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోరెన్సిక్ టెక్నిక్స్ ద్వారా నిందితుడిని గుర్తించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అతని వేలిముద్రల ద్వారా నిందితుడిని గుర్తించి, కాలిఫోర్నియాలోని అట్వాటర్ లోని ఆయన నివాసంలో ఆగస్టు 1న అరెస్టు చేశారు. "దొంగచాటుగా ఇంట్లోకి వెళ్లిన నిందితుడు.. వారు పడుకున్న మంచం అడుగున కూర్చొని ఇద్దరు మహిళల పాదాలను రుద్దుతూ.. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అయితే, వీరిలో ఒక మహిళ లేవడం.. గట్టిగా అరవడంతో పారిపోయాడని" అధికారులు తెలిపారు.
నిందితుడిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మహిళ బూట్లు దొంగిలించడం, అతిక్రమించడం, బహిరంగ ప్రదేశాల్లో లైంగిక స్వయంతృప్తి చర్యలు వంటి అనేక నేరాలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయని షెరీఫ్ డిపార్ట్ మెంట్ తెలిపింది. "ఈ రకమైన నేరాలు ముఖ్యంగా ఒక సమాజానికి ఆందోళన కలిగిస్తాయి.. నిందితుడిని అరెస్టు చేయగలగడం వల్ల బాధితులు, సమాజం తిరిగి సురక్షితంగా ఉండటానికి పరిస్థితులు ఏర్పడుతాయి" అని అధికారులు పేర్కొన్నారు.