
కొలరెడో : కొలరెడోలో దారుణం చోటు చేసుకుంది. తాళికట్టిన భార్యను...ముక్కుపచ్చలారని చిన్నారులను అత్యంత క్రూరంగా చంపేశాడు ఓ వ్యక్తి. వారి మృతదేహాలను ఎవరికి దొరక్కుండా ఉండేందుకు మరుగుతున్న ఆయిల్ ట్యాంకులో పడేశాడు. కొలరెడోకు చెందిన క్రిస్టోఫర్ లీ వాట్స్, షనన్ వాట్స్ దంపతులు. వీరికి బెల్లా(4),సెలస్టీ (3) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం షనన్15 వారాల గర్భిణి.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన క్రిస్టోఫర్ లీ వాట్స్ ఓ పెట్రోలియం కంపెనీలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు . భార్య షనన్ కూడా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అయితే గత రెండేళ్లుగా ఈ దంపతులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. క్రిస్టోఫర్ అప్పులు చేశాడు.
ఈ నేపథ్యంలోనే క్రిస్టోఫర్ భార్య పిల్లలను హత్యచేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత చిన్నారులు బెల్లా, సెలస్టీ మృతదేహాలను తాను పనిచేసే పెట్రోలిలయం కంపెనీలోని ఆయిల్ ట్యాంకుల్లో కుక్కేశాడు. షనన్ శవాన్ని మాత్రం వేరే చోట పడేశారు.
హత్య చేసిన తర్వాత క్రిస్టోఫర్ తనకు ఏమీ తెలియదన్నట్లు తన భార్య పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా క్రిస్టోఫర్ పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
షనన్, బెల్లా, సెలస్టీల హత్యకు గురయ్యారన్న విషయం తెలుసుకున్నషనన్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. షనన్‌కు భర్త అంటే ఎంతో ప్రేమ అని గుర్తు చేశారు. మూడోసారి గర్భవతి అయిన షనన్ ఎంతో మురిసిపోయిందని తెలిపారు. ఇద్దరు కూతుళ్లకు తండ్రి అయిన బెస్ట్ ఫాదర్ క్రిస్టీ అని తెలిపిందన్నారు. తమ ప్రేమను పంచుకునేందుకు నిక్ కూడా వస్తున్నాడంటూ ఎంత గానో ఆనందపడినట్లు చెప్పారు.
కానీ క్రిస్టీ మాత్రం షనన్ పట్ల చాలా దారుణంగా వ్యవహరించాడు. గర్భవతి అనే కనికరం లేకుండా తనని హత్య చేశాడు. ముద్దొలొలికే ఆ చిన్నారుల శవాలు కూడా చూసే వీలు లేకుండా చేశాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టోఫర్ ను కఠినంగా శిక్షించాలని షనన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.