US-Mexico Border: అమెరికా, మెక్సికోల‌ మధ్య భారీ సొరంగం.. మ‌త్తు ప‌ద్దారాల ర‌వాణా కోసం!

By Rajesh KFirst Published May 19, 2022, 4:33 AM IST
Highlights

US-Mexico Border: మ‌త్తు ప‌ద్దారాల ర‌వాణా కోసం మెక్సికో నుండి అమెరికా వరకు ఉన్న భారీ సొరంగం ఒకటి బయటపడింది. మెక్సికోలోని టిజువానా నుండి అమెరికాలోని శాన్‌ డియాగో ప్రాంతంలోని ఒక గిడ్డంగి వరకు ఈ సొరంగం విస్తరించినట్లు అధికారులు తెలిపారు.
 

US-Mexico Border:  అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను కలిగి ఉన్న అమెరికా, మెక్సికో దేశాల సరిహద్దుల‌ మ‌ధ్య భారీ సొరంగం బ‌య‌ట‌ప‌డింది. శాన్ డియాగోలోని ఓటే మీసా సరిహద్దు క్రాసింగ్ సమీపంలో భారీ, విశాల‌మైన‌  సొరంగాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి. ఈ సొరంగం ద్వారా మెక్సికోలోని టిజువానా నుంచి  అమెరికాలోని శాన్ డియాగో కు వెళ్ల‌వ‌చ్చ‌ని గుర్తించారు. 

ఈ సొరంగంలో స్వంత రైల్వే లైన్, విద్యుత్, ప‌టిష్ట‌మైన గోడ‌ల‌తో ఏర్పాటు చేయబడింది. సొరంగం పొడవు 1744 అడుగులు, లోతు దాదాపు 61 అడుగులు ఉన్న‌ట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. ఈ సొరంగం ద్వారా అమెరికా-మెక్సికో సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న‌ట్టు అమెరికా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి. గత రెండు దశాబ్దాలలో డజనుకు పైగా సొరంగాలు కనుగొనబడిన ప్రాంతంలోనే ఈ సొరంగం కనుగొనబ‌డ‌టం గ‌మ‌నార్హం.   

ఈ సొరంగం ఎంతకాలం నుంచి పనిచేస్తుందో, ఎంత వరకు డ్రగ్స్‌ ఉన్నాయో తెలియరాలేదని అమెరికా అధికారులు తెలిపారు. విచారణ స‌మ‌యంలో 799 కిలోల (1,761 పౌండ్లు) కొకైన్, 75 కిలోల (165 పౌండ్లు) మెథాంఫేటమిన్,  1.6 కిలోల (3.5 పౌండ్లు) హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.193 కోట్లకు పైమాటే.

మెక్సికో ప్రభుత్వంతో కలిసి మేము సొరంగాల త‌వ్వ‌కాల‌ను నిర్మూలిస్తున్నాం. ఈ సొరంగాలు  ఉనికిలో ఉండకూడదు. వీటితో చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ నేరాలు జరుగుతాయి. డ్ర‌గ్స్ వ‌ల్ల ఎలాంటి న‌ష్టాలు ఏర్పాడుతాయో చూస్తున్నాము" అని మెక్సికోలోని యుఎస్ రాయబారి కెన్ సలాజర్ చెప్పారు. తాజా మార్గం మెక్సికన్ సరిహద్దు నగరమైన టిజువానాకు 532 మీటర్లు నడిచింది. ఇది దాదాపు ఆరు అంతస్తుల లోతులో ఉంది.  

మెక్సికో నుండి US లోని కాలిఫోర్నియాలోని పారిశ్రామిక ప్రాంతంలోని ఒక గిడ్డంగి వరకు విస్తరించి ఉన్నద‌ని, ఓ ప్రధాన డ్రగ్ స్మగ్లింగ్ సొరంగం ఏర్పాటు చేసిన‌ట్టు యునైటెడ్ స్టేట్స్  అధికారులు ప్రకటించారు.  ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ప్రాంతంలో చాలా  సొరంగాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ ప్రాంతంలో అంటే టిజువానా-శాన్ డియాగో ప్రాంతంలో కనుగొనబడిన 91వ సొరంగం ఇది. 1993 నుండి అమెరికా- మెక్సికో సరిహద్దులో 272 సొరంగాలు కనుగొనబడ్డాయి.  

click me!