
ఉక్రెయిన్‌లోని బుచాలో జరిగిన హత్యలపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో యూఎస్ జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని వార్తా సంస్థ AFP తెలిపింది.
బుచా, కైవ్ చుట్టుపక్కల ఉన్న ఇతర పట్టణాలలో పౌరులను రష్యా దళాలు అతి కిరాతకంగా హత్య చేశాయని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ హత్యలు ఒక్క సారిగా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో మాస్కోపై కొత్త ఆంక్షల కోసం పిలుపునిచ్చాయి.
యూఎన్ జనరల్ అసెంబ్లీలో 193 మంది సభ్య దేశాలు ఉన్నాయి. హత్యాకాండపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రష్యాను మానవ హక్కుల మండలి నుంచి సస్పెండ్ చేయాలని యునైటెడ్ స్టేట్స్ జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించింది. అయితే ఈ తీర్మానానికి 93 మంది అనుకూలంగా ఓటు వేశారు. 24 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 58 దేశాల సభ్యులు గైర్హాజరయ్యారు. మెజారిటీ ఓట్లు రష్యాకు వ్యతిరేకంగా పడటంతో ఆ తీర్మానం ఆమోదం పొందినట్లైంది. దీంతో మానవ హక్కుల మండలి నుంచి రష్యా సస్పెండ్ అయ్యింది.
ఈ మానవ హక్కుల మండలి నంచి ఒక దేశం సస్పెండ్ కు గురి కావడం ఇది రెండోసారి. 2011 సంవత్సరంలో లిబియా మొదటి సారిగా ఇలా సస్పెండ్ అయ్యింది. కాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి రష్యాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ఉక్రెయిన్ సంతోషం వ్యక్తం చేసింది. ఐక్య రాజ్య సమితికి ‘‘కృతజ్ఞతలు’’ అని ఉక్రెయిన్ పేర్కొంది. యుద్ధ నేరస్థులు ఇలాంటి వాటిలో ప్రాతినిధ్యం వహించకూడదని చెప్పింది.
ఐక్య రాజ్య సమితి తీసుకున్న ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విట్టర్‌లో స్పందించారు. మానవ హక్కులను పరిరక్షించే ఐక్యరాజ్యసమితి సంస్థల్లో యుద్ధ నేరగాళ్లకు చోటు లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘‘ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చిన అన్ని సభ్య దేశాలకు కృతజ్ఞతలు.’’ అని డిమిట్రో కులేబా ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్ కు, రష్యాకు యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్దం మొదలైన నాటి నుంచి రెండు దేశాలకు తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది. అయితే ఇటీవల రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బుచా పట్టణంలో మారణహోమం సృష్టించాయి. దీనిని ప్రపంచ దేశాలు ఖండించాయి. భారత్ కూడా ఈ చర్యను తీవ్రంగా ఆక్షేపించింది.
రష్యా బలగాలు బుచా పట్టణంలో 45 అడుగుల కందకం తవ్వి అందులో దాదాపుగా 410 మృతదేహాలను ఖననం చేశాయి. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో అన్ని దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా రష్యా దురాగతాలపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఆ దేశంపై ఆంక్షల్ని కఠిన తరం చేయాలని ఆమెరికా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐక్య రాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిని సభ ఆమోదించింది.