
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత.. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. ఈ సంక్షోభం నుంచి బయట పడటానికి పలు దేశాలు సహాయం అందిస్తున్నాయి. ఈ సమయంలో ఐక్యరాజ్యసమితి హైకమిషన్ (UNHCR) ఓ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో దాదాపు 90 శాతం ఆఫ్ఘన్ ప్రజలు ఆకలి అంచున ఉన్నారని, 150,000 కంటే ఎక్కువ కుటుంబాలలో 1.1 మిలియన్ ఆఫ్ఘన్లు మానవతా సహాయం కోసం వేచి ఉన్నారని తెలిపింది.
ఐక్యరాజ్యసమితి హైకమిషన్ .. ఆఫ్ఘనిస్తాన్‌లోని పేద పౌరులకు సహాయం చేయడానికి ప్రపంచ ఆహార కార్యక్రమం, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి నుండి సహాయం అందించింది. గత ఏడాది ఆగస్టులో తాలిబాన్ నియంత్రణ తర్వాత, సహాయానికి అంతరాయం ఏర్పడింది.అనేక ప్రావిన్స్‌లతో పాటు, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో దాదాపు 1,300 కుటుంబాలు శత్రుత్వాల కారణంగా వారి నివాస ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు బలవంతంగా వలస వెళ్లారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో 20 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం అవసరం
UN అంచనా ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో 20 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం అవసరమని ఖమా ప్రెస్ నివేదించింది. ఆఫ్ఘనిస్తాన్ లో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం చిన్న వ్యాపారాలను తాకింది, ప్రైవేట్ కంపెనీల అమ్మకాలను తగ్గించింది. ఉత్పత్తుల కోసం వినియోగదారుల డిమాండ్ గణనీయంగా తగ్గడం వల్ల వారి శ్రామికశక్తిలో సగానికి పైగా తొలగించబడింది అని సర్వేలో వెల్లడయ్యింది.
చిన్న పరిశ్రమలకు తీవ్ర నష్టం
సర్వే ప్రకారం.. చిన్న పరిశ్రమలు ఎక్కువగా నష్టపోతున్నాయి. తాలిబాన్ పాలన వచ్చినప్పటి నుండి దేశంలో పేదరికం రేటు 95 శాతానికి పైగా పెరిగింది, అయితే 56 శాతం మంది రోజువారీ ఆదాయంలో తగ్గుదల మధ్య దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో దేశం మానవతా సంక్షోభంతో పోరాడుతున్నందున మిలియన్ల మంది ఆఫ్ఘన్లు ఆకలి అంచున ఉన్నారు.